మ్యాట్రీమోనియల్వెబ్సైట్స్ లో పెళ్లి పేరుతో యువకుడి ఘరానా మోసం బయటపడింది. పెళ్లి పేరుతో మ్యాట్రిమోనియల్వెబ్సైట్స్ అడ్డంపెట్టుకుని ఏకంగా 26 మంది యువతులను మోసం చేశాడు. వారి వద్ద నుంచి రూ.కోట్ల డబ్బుతో ఉడాయించాడు. అతడిని జూబ్లీహిల్స్పోలీసులు పట్టుకున్నారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏపీలోని రాజమండ్రికి చెందిన వంశీకృష్ణ షాదీ డాట్ కాం ద్వారా తనకు పరిచయం అయి తనను పెళ్లి పేరుతో మోసం చేసాడని ఓ ప్రైవేటు వైద్యురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వంశీకృష్ణను అరెస్ట్ చేశారు. అయితే విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. వంశీకృష్ణ తన ప్రొఫైల్ ఫోటోగా యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫొటోను వాడి యువతులను నమ్మించి మోసం చేసినట్లు తేలింది. 4 రాష్ట్రాల్లో 26 మంది యువతులను ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి వారి నుంచి డబ్బులు వసూలు చేసేవాడని గుర్తించారు. అలా వసూలు చేసిన డబ్బుతో బెంగళూరులో గుర్రం పందేలు, గోవాలో క్యాసినో వంటి జూద క్రీడలకు వాడి ఖర్చు చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. మోసాలు బయటపడకుండా ఎప్పటికప్పుడు సిమ్ కార్డులు మార్చేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి చేతిలో మోసపోయిన బాధితులు నిర్భయంగా ముందుకు రావాలని సూచించారు.








