Mahaa Daily Exclusive

  ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసు రాజ్‌ కసిరెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఏపీ సిట్ అధికారులు హైదరాబాద్‌లో సోదాలు…!

Share

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో మద్యం కుంభకోణంపై సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్నీ తానై వ్యవహరించారనే అభియోగాలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి (రాజ్‌ కసిరెడ్డి)కి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సిట్‌ బృందం సోదాలు జరిపింది. హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాల్లో సిట్‌ అధికారులు తనిఖీలు చేశారు. కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఇప్పటివరకు మూడుసార్లు నోటీసులు ఇచ్చినా ఆయన బేఖాతరు చేశారు. విచారణకు హాజరు కాకుండా పరారయ్యారు. మద్యం కేసులో విచారణకు హాజరుకావాలంటూ మార్చి 28, 29వ తేదీల్లో వరుసగా రెండుసార్లు సిట్‌ నోటీసులిచ్చినా ఆయన పట్టించుకోలేదు. ఈ కేసులో తనకు ఏ ప్రాతిపదికన నోటీసులిచ్చారో చెప్పాలంటూ సిట్‌ నోటీసుల్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. వాటిలో తాము జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు విచారణకు హాజరయ్యేందుకు రాజ్‌ కసిరెడ్డికి తగినంత సమయమిస్తూ ఏప్రిల్‌ 9న విచారణకు రావాలంటూ ఏప్రిల్‌ 5న సిట్‌ అధికారులు మూడోసారి నోటీసులిచ్చారు. ఈసారి కూడా ఆయన విచారణకు రాలేదు. ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసేసి పరారయ్యారు. ఈ నేపథ్యంలోనే సిట్‌ అధికారుల బృందం హైదరాబాద్‌లోని కసిరెడ్డికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తోంది. దర్యాప్తులో భాగంగా రాజ్‌ కసిరెడ్డిని విచారిస్తే స్కామ్‌కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎక్సైజ్‌ శాఖలోని పోలీసుల ప్రమేయంపైనా సిట్‌ దర్యాప్తు చేస్తోంది.