తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కాం అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గ్రూప్ 1 రిక్రూట్ మెంట్ విషయంపై తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, గ్రూప్ వన్ మెయిన్స్ కు ఒక హాల్ టికెట్, ప్రిలిమ్స్ కు మరొక హాల్ టికెట్ ఇచ్చారన్నారు. పరీక్ష రాయకుండానే పది మంది పాస్ అయినట్లు ఫలితాలు వెలువడ్డాయన్నారు. పరీక్ష రాసింది 21,093 మంది అయితే ఫలితాలు 21 వేల 103 మందికి ఇచ్చారని, పరీక్ష రాయకుండానే పదిమందికి ఫలితాలు ఎలా ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. హాల్ టికెట్ పక్కపక్కనే ఉన్న 654 మందికి ఒకే విధమైన మార్కులు వచ్చాయని, ఇది ఎలా సాధ్యమో చెప్పాలని ఆయన నిలదీశారు. ప్రొఫెసర్ల తో ఎందుకు వీటిని కరెక్షన్ చేయించలేదని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్సీ కోడలు ర్యాంకుపైన అనుమానం ఉందన్నారు. సెంటర్ నెంబర్ 19 లో పరీక్ష రాసిన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కోడలుకు 206 ర్యాంకు వచ్చిందని, ఎస్టీలలో ఈమెకు ఫస్ట్ ర్యాంకు వచ్చిందని, ఇక ఈ వ్యవహారంపైన తనకు అనుమానం ఉందని అన్నారు . పేపర్ కరెక్షన్ లో తప్పులు జరిగాయన్నారు. ఇక పూజిత రెడ్డి అనే అమ్మాయి పరీక్ష రాయగా ఆమెకు 483 మార్కులు వచ్చాయని, ఆమె రీకౌంటింగ్ పెట్టుకుంటే 423 మార్కులు వచ్చాయని పేర్కొన్నారు. రీకౌంటింగ్ చేస్తే 60 మార్కులు తగ్గాయని, అంత వ్యత్యాసం ఎలా ఉంటుందంటూ కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఒక పేపర్ కరెక్షన్ లో ఎన్ని తప్పులు ఉన్నాయో ఈ వ్యవహారంతో అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు.








