Mahaa Daily Exclusive

  అంబేద్కర్ జీవితమే మాకు స్పూర్తి అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న మోదీ సర్కార్ కేంద్ర మంత్రి బండి సంజయ్…!

Share

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పండుగలా నిర్వహించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించడం హాస్యాస్పదమని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ‘‘కాంగ్రెస్ తీరు ఎట్లుందంటే చంపినోడే సంతాప పెట్టినట్లుగా ఉంది’’అని పేర్కొన్నారు. అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించిందే కాంగ్రెస్ అని, ఆయనపై కుట్ర చేసి రెండుసార్లు ఓడించిందే కాంగ్రెస్ అని అన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వకుండా అవమానించడమే కాకుండా ఆయననను ఓడించిన వ్యక్తికి పద్మభూషణ్ ప్రదానం చేసింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. అలాంటి పార్టీ ఇయాళ అంబేద్కర్ జయంతిని పండుగలా నిర్వహించాలనడం సిగ్గుచేటన్నారు. తక్షణమే బడుగు, బలహీనవర్గాల ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించారు.

అంబేద్కర్ జయంతి సందర్భంగా 120 దేశాల్లో ఉత్సవాలను నిర్వహిస్తున్నామని సంజయ్ తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేయడమంటే ఆయన జీవిత చరిత్రను గుర్తు చేయడం, ఆయన బాటలో నడవడమేనని పేర్కొన్నారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవ పతాక అంబేద్కర్ అని సంజయ్ కొనియాడారు. ఆయన జీవితం మనందరికీ స్పూర్దిదాయకమన్నారు. అంబేద్కర్ భిక్షవల్లే ప్రధాని కాగలిగానని మోదీ అన్నారంటే వారి గొప్పతనం ఏమిటో అర్ధం చేసుకోవచ్చన్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ జీ, పార్టీ ముఖ్య నేతలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఆలోచనా విధానాన్ని బలపర్చిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. దేశ విభజనను, జమ్మూకాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని వ్యతిరేకించారనిపేర్కొన్నారు.