రాష్ట్రంలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజులలో మరింత ఎండల తీవ్రత ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వడదెబ్బ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని ఐఎండీ చేసిన సూచనలతో రేవంత్ సర్కార్ అప్రమత్తమైంది. వడగాల్పులను విపత్తుగా ప్రకటించిన ప్రభుత్వం ముందస్తు చర్యలకు రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే హీట్ వేవ్, సన్ స్ట్రోక్ లను రాష్ట్ర నిర్దిష్ట విపత్తులుగా ప్రకటిస్తూ మంగళవారం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది. తీవ్ర ఎండల వల్ల వచ్చే వడగాల్పులను రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించాలని భావించింది. ఇకనుంచి వడదెబ్బ బారిన పడే బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని వారికి ఉపశమనం కల్పించే ఉద్దేశంతో ఎక్స్గ్రేషియాను పెంపు చేసింది. ఆపద్బంధు పథకం క్రింద నాలుగు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా పునరావాస సహాయ నిబంధనల ప్రకారం ఎక్స్గ్రేషియా అందించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం వారికి అందించే ఆర్థిక సహాయాన్ని భారీగా పెంచింది. ఇప్పటివరకు ఆపద్బంధు పథకం కింద బాధిత కుటుంబాలకు 50 వేల రూపాయల ఎక్స్గ్రేషియా అందించేవారు. అయితే తాజా ప్రకటన ప్రకారం వడదెబ్బతో మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి విపత్తు ప్రతిస్పందన నిధి నుండి ఆపద్బంధు పథకం కింద నాలుగు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కసారిగా 50 వేల నుంచి నాలుగు లక్షల రూపాయలకు ఈ పరిహారం పెంపుదల చేయడంతో బాధిత కుటుంబాలకు కొంతైనా భరోసా లభిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. వడదెబ్బ కారణంగా ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో ఈ సంవత్సరం వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తీవ్రంగా ఎండలు ఉన్నాయని, తీవ్రంగా వడగాలులు వీచే సమయంలో, ఎండలు ఉన్న సమయంలో బయటకు రావద్దని పేర్కొంది. తీవ్రమైన ఎండల నేపధ్యంలో వాతావరణ శాఖ సూచనలను, వైద్య ఆరోగ్య శాఖ సూచించే జాగ్రత్తలను పాటించాలని పేర్కొంది.








