సింగరేణి చరిత్రలో నైనీ గని ప్రారంభం ఒక సువర్ణాధ్యాయం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అధికారులతో కలిసి ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ ను భట్టి విక్రమార్క వర్చువల్ గా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒడిశాలో సింగరేణి విస్తరణ తెలంగాణకు గర్వకారణం అన్నారు. ఇది సింగరేణికి మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక ఆనందకర సందర్భం అన్నారు. సింగరేణి విశ్వవ్యాప్త విస్తరణకు నైనీ బ్లాక్ ప్రారంభం తొలి మెట్టు అని, ప్రజాపాలనలోనే నైనీ బొగ్గు బ్లాక్ పై ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజాపాలనలో ఇతర రాష్ట్రాలకు సింగరేణిని విస్తరిస్తామన్నారు. బొగ్గుగని ఏర్పాటుకు సహకరించిన ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ కు భట్టి ధన్యవాదాలు తెలిపారు.
ఉపరితల గనుల్లో ఇదే అతిపెద్దది
ఒడిశాలోని నైనీ గనిలో 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఏడాదికి కోటి టన్నుల చొప్పున 38ఏళ్లపాటు తవ్వకాలు చేపట్టనున్నారు. ప్రస్తుతమున్న ఉపరితల గనుల్లో ఇదే అతిపెద్దది. నైనీలో అత్యంత నాణ్యమైన జీ-10 రకం బొగ్గు ఉన్నట్టు అంచనా. కాగా, తెలంగాణ కాకుండా తొలిసారి ఇతర రాష్ట్రాల్లో బొగ్గు తవ్వకాలు చేపట్టబోతోంది సింగరేణి. ఇప్పటివరకు తెలంగాణకే పరిమితమైన సింగరేణి.. ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలో అడుగుపెడుతోంది. నైనీ బొగ్గు గనిలో తవ్వకాలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఒడిశాలోని నైనీ గనిని 2016లో సింగరేణికి కేటాయించింది . అన్ని అనుమతులు సాధించి తవ్వకాలు ప్రారంభించడానికి తొమ్మిదేళ్ల సుదీర్ఘకాలం పట్టింది. సింగరేణికి ఉన్న ఉపరితల గనుల్లో ఇదే అతిపెద్దది. ఇక్కడ 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అత్యంత మేలైన జీ-10 రకం బొగ్గు ఇక్కడ ఉన్నట్టు గుర్తించింది సింగరేణి. ఏడాదికి కోటి టన్నుల చొప్పున 38ఏళ్లపాటు ఇక్కడ బొగ్గు తవ్వితీయనున్నారు.
సింగరేణి చరిత్రలో కొత్త అధ్యాయం.. ప్రపంచ సంస్థగా ఎదగాలని కిషన్ రెడ్డి ఆకాంక్ష
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో కేంద్ర ప్రభుత్వం, బొగ్గు మంత్రిత్వ శాఖ తరపున, ఈ బొగ్గు బ్లాక్ నిర్వహణలో ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మొత్తం సింగరేణి కుటుంబం విజయం సాధించాలని, రాబోయే అనేక మైలురాళ్లను అధిగమించాలని కోరుకుంటున్నట్లు కిషన్ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు.
కొత్త శకానికి నాంది: సీఎం రేవంత్ రెడ్డి
ఒడిశాలోని అంగుల్ జిల్లాలోని నైనీ గని ప్రారంభించడం ద్వారా సింగరేణి కొత్త శకానికి నాంది పలికిందని ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు. సింగరేణి సంస్థ చరిత్రలో మొదటిసారి బయటి రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించడం అభినందనీయమన్నారు. నైనీ బ్లాకులో బొగ్గు తవ్వకాలను ప్రారంభించిన నేపథ్యంలో సింగరేణి సంస్థకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. దాదాపు 136 ఏళ్లుగా తవ్వకాలు సాగిస్తూ రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న తెలంగాణ సింగరేణి, రాష్ట్రం బయట ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకులో తవ్వకాలు ప్రారంభించి భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ట్వీట్ చేసింది.








