Mahaa Daily Exclusive

  పురావస్తు కట్టడాలకు నష్టం కలిగించొద్దు అక్కడ మెట్రో నిర్మాణాలను చేపట్టొద్దు హైకోర్టు కీలక ఆదేశం…!

Share

హైదరాబాద్​లోని పాతబస్తీలో మెట్రో నిర్మాణ పనులపై తెలంగాణ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. యాక్ట్‌ ఫర్‌ పబ్లిక్‌ వెల్ఫేర్‌ అనే ఫౌండేషన్‌ హైకోర్టులో ఈ పిటిషన్​ను దాఖలు చేసింది. దానిలో భాగంగా మెట్రో నిర్మాణం వల్ల పాతబస్తీలోని పలు చారిత్రక కట్టడాలు దెబ్బ తింటున్నాయని పిటిషన్‌లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ వాదనలు వినిపిస్తూ పురావస్తు శాఖ గుర్తించిన చారిత్రక కట్టడాలకు నష్టం లేకుండా చూస్తున్నామని, చారిత్రక కట్టడాలను కూలగొట్టడం లేదని కోర్టుకు తెలిపారు. పరిహారం చెల్లించాకే స్థలాలు సేకరించి నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయడానికి ఏఏజీ న్యాయస్థానాన్ని కొంత సమయం కావాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ పాతబస్తీలోని మెట్రో నిర్మాణ పనుల్లో భాగంగా చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం చేయకూడదని ప్రభుత్వానికి సూచించింది. పురావస్తు శాఖ గుర్తించిన చారిత్రక కట్టడాల వద్ద ఎలాంటి పనులు చేపట్టకూడదని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 22లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు, పిటిషన్‌పై తదుపరి విచారణను ఏప్రిల్ 22కి వాయిదా వేసింది.