Mahaa Daily Exclusive

  భూభార‌తి రైతుల‌కు శ్రీ‌రామ‌ర‌క్ష‌ ప్ర‌జ‌ల సూచ‌న‌ల‌తో అవ‌స‌ర‌మైతే భూభార‌తిలో మార్పులు రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..!

Share

రాష్ట్రంలో భూభార‌తి చ‌ట్టాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలించి ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే సూచ‌న‌లు స‌ల‌హాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని అవ‌స‌ర‌మైతే మార్పులు చేస్తామ‌ని, ఈ చ‌ట్టాన్ని భూయ‌జ‌మానుల‌కు మ‌రింత చేరువ చేస్తామ‌ని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల మీద ఈ చ‌ట్టాన్నిబ‌ల‌వంతంగా రుద్ద‌బోమ‌ని వారి సూచ‌న‌ల మేర‌కు ఆమోద‌యోగ్యంగా తీర్చిదిద్దుతామ‌ని అందుకే ఈ స‌ద‌స్సులు నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. భూ భారతి- 2025 చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా మంగ‌ళ‌వారం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా వ‌లిగొండ మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ చ‌ట్టం చేసేముందు రైతుల క‌ష్టం గురించి ఆలోచించి ప్ర‌త్యేక క‌మిటీ ఏర్పాటు చేశామ‌న్నారు. ఆ క‌మిటీ సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న లోకి తీసుకొని రైతులుకు శ్రీ‌రామ‌ర‌క్ష‌లా నిలిచే భూభార‌తి -2025 చ‌ట్టాన్ని రూపొందించామ‌ని తెలిపారు. గ‌తంలో నాలుగు గోడ‌ల మధ్య స్వార్ధ‌పూరితంగా త‌యారుచేసిన ధ‌ర‌ణి చ‌ట్టానికి మూడేళ్లు గ‌డిచినా నియ‌మ‌నిబంధ‌న‌లు రూపొందించ‌లేదు. నాడు దొర‌వారి నోటి నుంచి వ‌చ్చే మాట‌లే నియ‌మాలు, నిబంధ‌న‌లుగా చ‌లామ‌ణి అయ్యాయి. ఫ‌లితంగా ప్ర‌జ‌ల‌కు క‌ష్టాలు త‌ప్ప‌లేదు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు మండ‌లాల్లో తొలివిడ‌త ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేసి అన్ని వివ‌రాలు, ద‌ర‌ఖాస్తులు సేక‌రిస్తాం. జూన్ 2 నాటికి వీలైన‌న్ని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించి , అర్హులైన వారికి అందుబాటులో ఉన్న ప్ర‌భుత్వ భూముల‌ను ప‌ట్టాలుగా అంద‌జేస్తాం. భూయ‌జ‌మానుల‌కు న్యాయం జ‌రిగేలా త‌హ‌శీల్దార్ మొద‌లు కొని సిసిఎల్ఎ వ‌ర‌కు ఐదంచెల వ్య‌వ‌స్ద‌ను అందుబాటులోకి తెస్తున్నాం. సిసిఎల్ఎ వ‌ద్ద కూడా న్యాయం జ‌ర‌గ‌లేద‌ని భావిస్తే ట్రిబ్యున‌ల్‌ను ఆశ్ర‌యించ‌వ‌చ్చు. ఈమేర‌కు రాష్ట్రవ్యాప్తంగా అవ‌స‌ర‌మైన‌న్ని ట్రిబ్యున‌ల్స్ ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా మీ ఫిర్యాదుల‌ను అవ‌స‌ర‌మైతే ఇంటినుంచి అధికారుల‌కు పంపేలా పోర్ట‌ల్‌లో అవ‌కాశం ఉంది. ఫిర్యాదుల‌పై రెవెన్యూ శాఖ కార్య‌ద‌ర్శికి, మంత్రిగా నాకు క‌నిపించేలా పోర్ట‌ల్‌ను రూపొందించాం. రాష్ట్రంలో వచ్చేనెల 10వ తేదీక‌ల్లా రెవెన్యూ , గ్రామ‌ప‌రిపాల‌నాధికారులు మీకు పూర్తిగా అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు చేప‌డుతున్నాం. త‌ప్పుచేసే అధికారుల‌పై చ‌ర్య‌లకు వెనుకాడ‌బోం. గ‌తంలో రైతు బందు కోసం గులాబీ రంగు కార్య‌కర్త‌ల‌కు భూమి లేక‌పోయినా ప‌ట్టాదారు పాసుపుస్త‌కాలు ఇచ్చారు. స‌క్ర‌మంకాని అటువంటి అక్ర‌మాల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వు. రైతుల‌కు మ‌రిన్ని సేవ‌లు అందేలా రెవెన్యూ వ్య‌వ‌స్ద ప‌నిచేయాల‌ని ఏ పార్టీ కార్య‌క‌ర్త అనే ప‌క్ష‌పాతం లేకుండా ఇందిర‌మ్మ రాజ్యంలో పేద‌ల‌కు చ‌ట్టం ఒక చుట్టంలా ఉప‌యోగ‌ప‌డేలా చూడాల‌ని మంత్రి పొంగులేటి కోరారు.