పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ పై భారత ప్రభుత్వం వేట మొదలైంది. ఇప్పటికే పాకిస్థాన్ పౌరులకు సార్క్ వీసాలను రద్దుచేసింది కేంద్ర ప్రభుత్వం. పాకిస్థాన్ పౌరులంతా తక్షణమే దేశం వీడిచి వెళ్లాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు అమిత్ షా కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో తాత్కాలిక వీసాలతో భారత్లోకి వచ్చిన వారి వివరాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం పంపింది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరానికి 208 మంది పాక్ పౌరులు తాత్కాలిక వీసాపై వచ్చినట్టు తేలింది. వారి వివరాలపై ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్ ఆరా తీస్తోంది. వీలైనంత త్వరగా వారిని గుర్తించి పాకిస్థాన్ కు పంపించాలని ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేసింది. సెలవులపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ మేరకు జమ్మూకాశ్మీర్ పరిస్థితులపై అన్ని సైనిక విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు అధికారులు. భారత్లో పర్యటిస్తున్న పాకిస్థాన్ పౌరులు 48 గంటల్లోగా దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో భారత్ కు వచ్చిన పాకిస్థాన్ పౌరులు తిరుగు ప్రయాణం మొదలు పెట్టారు. దీంతో పాకిస్థాన్- భారత్ సరిహద్దు అయిన పంజాబ్లోని అటారీ- వాఘా సరిహద్దు వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు తమ బంధువులను కలుసుకునేందుకు 45 రోజుల వీసాపై భారత్కు వచ్చామని.. ఉగ్రదాడిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.








