ఖమ్మం – మహా.
దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఈ చర్యను నిరసిస్తూ మే 20న జరిగే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ప్రజలకు అఖిల పక్ష కార్మిక సంఘాల సంయుక్త సమావేశం పిలుపునిచ్చింది. మంచికంటి భవన్లో అఖిలపక్ష కార్మిక సంఘాల జిల్లా స్థాయి సంయుక్త సమావేశం మంగళవారం జరిగింది. సమావేశానికి ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి శింగు నర్సింహారావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జే. వెంకటేష్, టియుసిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సూర్యం, ఐఎన్టియుసి రాష్ట్ర నాయకులు -పాల్వంచ కృష్ణ, ఐఎన్టియు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కె. రాంసింగ్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ కార్మికులకు సంబంధించి ఏ చట్టాన్ని కార్మికుల పట్ల అభిమానంతోనో, వారి బాధలు గమనించో ఏ ప్రభుత్వం చేయలేదని భారతదేశ కార్మిక వర్గం -అనుభవిస్తున్న ప్రతి హక్కు వెనక దశాబ్దాల పోరాటం దాగి ఉందన్నారు. అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాసేందుకు సిద్ధమైందన్నారు. మోడీ యాజమాన్యాల లేదా శ్రమ దోపిడీదారుల పక్షాన పని చేస్తున్నారని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయకుండా ఉన్న చట్టాలను తొలగించి కార్మికులకు పని భద్రత లేకుండా చేస్తున్నారని వారు ఆరోపించారు. దశాబ్ద కాలంలో -మోడీ ప్రభుత్వం సంఘటిత అసంఘటిత కార్మికుల కొరకు ఖర్చు చేసిన మొత్తం లక్ష కోట్లు కూడా లేదని కాని కార్పొరేట్ సంస్థల కోసం రూ. 16.53 లక్షల కోట్లా రుణాలను మాఫీ చేశారని వారు తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పెరిగిన ధరలు, జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని కనీస వేతనాన్ని పెంచాల్సింది పోయి -తగ్గించిందన్నారు. రోజుకు రూ.70లకు కనీస వేతనాన్ని కుదించడం కార్మికుల పట్ల కక్ష సాధింపు చర్యగా వారు అభివర్ణించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా జరిగే ఈ సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు మద్దతునివ్వాలని సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ఏఐటియుసి జిల్లా -అధ్యక్షులు గాదె లక్ష్మి నారాయణ, నరాల నరేష్ నాయుడు (ఐఎన్టియుసి), విష్ణువర్దన్ (సిఐటియు). ఎ. వెంకటరెడ్డి, ఐ. వెంకన్న అధ్యక్షత వహించగా -ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, సిఐటియు కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు, టియుసిఐ జిల్లా కార్యదర్శి జి. రామయ్య, ఐఎన్టియుసి రాష్ట్ర నాయకులు నీలం రాజేష్, ఐఎన్టియు నాయకులు గుగులోత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.








