కూసుమంచి, ఏప్రిల్ 30, మహా:
వరి పండించిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సీపిఎం అనుబంధ తెలంగాణ రైతు సంఘం నాయకులు కోరారు. బుధవారం కూసుమంచి క్యాంప్ కార్యాలయంకు వచ్చిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రైతు సంఘం నాయకులు కలిసి వినతి చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ కూసుమంచి మండలంలో ఈ సంవత్సరం యాసంగి పంటగా 16 వేల ఎకరాల్లో వరి పండించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం వరి పంటకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పగా సన్న వడ్లను పండించాలని రైతులు ఎకరాకి ముప్పు 40 బస్తాల వరకు పంటను పండించారని, అట్టి పంటను రైతులు అనేక కష్టాలు పడి ఆరబెట్టి ఐకెపి ద్వారా ప్రభుత్వానికి అమ్ముటకు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారి వడ్లను సక్రమంగా కాటాలేయకుండా లారీలు లేవని, బస్తాలు లేవని రైతుల్ని తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తున్నారని, కొనుగోలు ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. ఈ రోజు కూసుమంచి మండలంలో అకాల వర్షానికి వరి పంట తడిసిపోయి, దెబ్బతినేటట్టు ఉందన్నారు. పంట సరిగా ఎండ లేదని, క్వింటాకు ఆరేడు కేజీలు తరుగు తీస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . కాంటాలు అయిన వాటికి సంబంధించి బోనస్ లు కూడా ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎక్కువ మొత్తంలో లారీలు తీసుకువచ్చి రైతాంగం పండించిన వారిని వెంటనే కాంటాలు వేచి రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రతి గింజను కొనుగోలు చేస్తాం..
రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ రైతు సంఘం కూసుమంచి మండల కమిటీ ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందజేయగా, ఈ సందర్భంగా స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఇబ్బందిపడకుండా కచ్చితంగా ప్రతి గింజను కొనుగోలు చేస్తామని హామినిచ్చారు. రైతులకు ఏఒక్కరికి కష్టం రాకుండా చూస్తామని హామి నిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు తోటకూరి రాజశేఖర్, బిక్కసాని గంగాధర్ రావు, శీలం గురుమూర్తి, మల్లెపల్లి మాజీ సర్పంచ్ తాళ్లూరి రవి తదితరులు పాల్గొన్నారు.








