ఖమ్మం – మహా.
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. మే 16 వ తేదీ మధ్యాహ్నం నుంచి మే 21వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తుండగా, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి వంటి జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు బలమైన గాలులు వీసే ప్రమాదం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో మెరుపులు, పిడుగులతో కూడిన గాలివానలు ఉంటాయని తెలిపింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, నల్గొండ, కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా.
ఈ వర్షాల ప్రభావంగా కొన్ని చోట్ల చెట్లు కూలడం, విద్యుత్ స్తంభాలు విరిగిపడటం, ట్రాఫిక్కు అంతరాయం కలగడం, రహదారులపై నీరు నిలిచిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో డ్రైనేజీ సిస్టమ్ సక్రమంగా లేకపోతే నీటిముట్టల సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడం, కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, కార్యాలయాల పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది.
రైతులకు ఈ వర్షాలు కొన్ని చోట్ల ఉపయోగకరంగా ఉండొచ్చు కానీ, ఉరుములు, పిడుగులు, బలమైన గాలులు పంటలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తలు అవసరం. పంటలు తడవకుండా చూడటం, గుంటల్లో నీరు నిలవకుండా చూస్తూ వ్యవసాయ పనులను తాత్కాలికంగా నిలిపివేయడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు వానకు తడవకుండా భద్రంగా ఉంచుకోవాలి. తడిచే అవకాశమున్న ఎరువుల నిల్వలను మళ్లించాలి.
వానల సమయంలో విద్యార్థులు, వృద్ధులు, గర్భిణులు బయటకు వెళ్లకుండా ఉండాలి. చెట్ల కింద, విద్యుత్ తీగల సమీపంలో నిలువకూడదు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలి. వర్షాల సమాచారాన్ని తెలుసుకోవడానికి మేఘదూత్, మౌసమ్, దామిని వంటి వాతావరణ శాఖ యాప్లను ఉపయోగించాలి. పబ్లిక్ అనౌన్స్మెంట్లు, ప్రభుత్వ హెచ్చరికలను గమనిస్తూ తప్పనిసరిగా పాటించాలి.
ప్రభుత్వం, పురపాలక శాఖలు, ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్ శాఖలు ముందస్తుగా సన్నద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వర్షాలు సమయంలో సేవలు నిలిపిపోకుండా చూడాలి. ఎమర్జెన్సీ సిబ్బంది అవసరమైన చోట కలిసేలా చర్యలు తీసుకోవాలనీ వాతావరణ శాఖ అధికారి తెలిపారు.







