ఖమ్మం,మహా.
ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయిల్ పామ్ సాగు, వ్యవసాయ శాఖ పనితీరుపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ గత 8 నెలల కాలంలో ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ దాదాపు రెండింతలు చేసుకోగలిగామని, దీనికి కృషి చేసిన అధికారులకు కలెక్టర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం లక్ష్యాలను పూర్తి చేసిన క్లస్టర్ అధికారులను అభినందిస్తూ వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి మండలంలో అధికంగా ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేసిన క్లస్టర్, తక్కువ జరిగిన క్లస్టర్ మధ్యలో గల అంతరాలను, కారణాలను తెలుసుకొని మంచి ఫలితాలు సాధిస్తున్న క్లస్టర్ లలో అనుసరిస్తున్న పద్ధతులను అందరూ పాటించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా డీడీలు తీసిన రైతులు వచ్చే వానాకాలం ఇతర పంటలు వేయకుండా జాగ్రత్త వహించాలని, వానాకాలం నుంచి డీడీలు తీసిన రైతుల పొలాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని, రైతుల దగ్గర నుంచి డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుకు కూడా డీడీలు స్వీకరించి ఆ సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు.
ఆయిల్ పామ్ పంటకు కోతుల బెడద ఉండదని, వరదలు వచ్చినా సమస్య ఉండదని, 4 సంవత్సరాల వరకు అంతర పంటల ద్వారా ఆదాయం వస్తుందని, తర్వాత ఎకరానికి అధిక లాభాలు వస్తాయని అన్నారు. క్లస్టర్ పరిధిలో ఉన్న పెద్ద రైతులను ముందుగా సంప్రదించి వారికి ఉన్న భూమిలో కొంత భాగంలో ఆయిల్ పామ్ పంట సాగు జరిగేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.
వ్యవసాయ విస్తరణ, హార్టికల్చర్ అధికారులు రైతుల పొలాల దగ్గరికి వెళ్లి ఆయిల్ పామ్ పండిస్తున్న రైతులతో మాట్లాడించాలని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారి తన క్లస్టర్ లోని ప్రతి గ్రామంలో కనీసం 10 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు విస్తరించేలా చర్యలు చేపట్టాలని, మనం కేటాయించిన లక్ష్యం చాలా తక్కువగా ఉందని, దీనిని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు.
గ్రామంలో 100 ఎకరాలలో ఆయిల్ పంట సాగు విస్తరణ జరిగితే అక్కడ కలెక్షన్ సెంటర్ కూడా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మన దేశంలో ఎక్కువ శాతం అవసరమైన వంటనూనె ఇతర దేశాల నుంచి వస్తుందని, మన రైతులు పండించే పంటకు తప్పనిసరిగా అద్భుతమైన మార్కెట్ ఉంటుందని, దీని గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు.
జిల్లాలో ఉన్న ధాన్యం, మిర్చి, పత్తి పంట కొనుగోలు కేంద్రాల వద్ద ఆయిల్ పామ్ ఫ్లెక్సీలు, వ్యవసాయ మార్కెట్ యార్డు లలో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి ఆయిల్ పామ్ సాగు లాభాలను వివరించాలని కలెక్టర్ అన్నారు. మక్క, వరి, పత్తి, మిర్చి పంటలు సాగు చేయడం వల్ల వచ్చే ఆదాయం, ఆయిల్ పామ్ పంట వల్ల వచ్చే ఆదాయం వివరాలతో కరపత్రాలను ముద్రించాలని అన్నారు.
ఖమ్మం జిల్లాలో ఉన్న ఆయిల్ పామ్ సాగు తోటలను రైతులు పరిశీలించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. 40 మంది రైతులను సమీకరించి వారికి బస్సు ఏర్పాటు చేసి ఫీల్డ్ విజిట్ తీసుకుని వెళ్లాలని, మన జిల్లాలో వచ్చే వారం నుంచి రెగ్యులర్ గా ఫీల్డ్ విజిట్ జరగాలని, ప్రతి క్లస్టర్ నుంచి ఫీల్డ్ విజిట్ చేసేందుకు రైతులను గుర్తించి వివరాలు అందించాలని కలెక్టర్ తెలిపారు.
నకిలీ విత్తనాలు అమ్మే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. మన క్లస్టర్ పరిధిలో మిర్చి క్లస్టర్ ఎన్ని ఉన్నాయో పరిశీలించి తనిఖీ చేయాలని, నర్సరీ అనుమతి ఉందా, నిబంధనలు పాటిస్తున్నారా వంటివి గమనించాలని అన్నారు.
రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా రసీదు పొందాలని, ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. గ్రామాలలో నివాసం ఉండే వారి వద్ద నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఆయిల్ పామ్, ఉద్యానశాఖ బ్రోచర్ లను ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో జిల్లా హార్టికల్చర్ సెరికల్చర్ అధికారి ఎం.వి. మధుసూదన్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, జిల్లా సహకార అధికారి గంగాధర్, నీటిపారుదల శాఖ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, ఏ.ఈ.ఓలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.








