Mahaa Daily Exclusive

  ఫీజు’ బ‌కాయిల‌కు మోక్షం ఎప్పుడు? సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ..1

Share

మహా: ఫీజు రీయంబ‌ర్స్‌మెంట్ పై అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా విద్యాసంస్థ‌ల ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలపై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని నిల‌దీశారు. పేరుకుపోయిన ఎనిమిది వేల కోట్ల బ‌కాయిల‌ను ఎప్పుడు చెల్లిస్తార‌ని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో ఇటు విద్యార్ధులు, ఆటు అధ్యాప‌క సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ వాపోయారు. ఈ మేర‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గురువారం ఆయ‌న బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ. ఎనిమిది వేల కోట్ల ఫీజు బకాయిలు పేరుకుపోయాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అధ్యాపకులకు జీతాలు, సిబ్బందికి భత్యాలు, కాలేజీల నిర్వహణ ఖర్చులు కూడా భరించలేని స్థితిలో ఉన్నాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకా సంవత్సరం కాలేదా?
ఇప్పటికే అనేక డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు మూతపడటం ప్రారంభించాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. విద్యార్థులకు ఫీజులు చెల్లించనిదే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో విద్యార్థులు, కళాశాల యాజమాన్యాల మధ్య వాగ్వాదాలు తీవ్రమై పోలీస్ స్టేషన్ల దాకా కేసులు వెళ్లుతున్నాయని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఫీజు బకాయిలను వన్ టైం సెటిల్ మెంట్ చేయాలని ఒకసారి, మరోసారి 12 వాయిదాల్లో చెల్లిస్తామని ముఖ్యమంత్రి మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ మాటలను విస్మరించడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. ఈ విద్యా సంవత్సరం నుండే బకాయిలను నిర్ణీత వ్యవధిలో చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తును, కళాశాలల మనుగడను దృష్టిలో పెట్టుకుని తక్షణమే బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యారంగంపై ప్రభుత్వం చూపుతున్న అలసత్వం లక్షలాది మంది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మానసిక క్షోభ కలిగిస్తోందని తీవ్రంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.