మహా: ప్రజల భూ సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. భూభారతి చట్టం అమలుతో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన భూభారతి పైలెట్ ప్రాజెక్టు గ్రామ సభలో మంత్రి సీతక్కతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రజలకు రెవెన్యూ శాఖ సేవలు సులభంగా, పారదర్శకంగా అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తుందని పేర్కొన్నారు. జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకువస్తామన్నారు. భూ భారతి చట్టం అమలుతో రెవెన్యూ అధికారులే స్వయంగా గ్రామాల్లోకి వచ్చి గ్రామ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి భూసమస్యల దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు.
దేశానికే రోల్ మోడల్
వచ్చే జూన్ 2 నాటికి గ్రామ రెవెన్యూ అధికారుల పున:నియామకం పూర్తవుతుందన్నారు. అందరి సలహాలతో రూపొందించిన భూభారతి చట్టం దేశానికే రోల్ మోడల్ అని చెప్పారు. జూన్ 2 నాటికి పైలెట్ ప్రాజెక్టు మండలాల్లో భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ధరణి లోపాలతో ప్రజలు కోరుకున్న చట్టం భూ భారతికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 6 వేల ప్రభుత్వ సర్వేయర్లు, వెయ్యి మంది లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం చేస్తామన్నారు. భూమితోనే మానవ జీవితం ముడిపడిందని మంత్రి సీతక్క అన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం తోనే భూ సమస్యలు తలెత్తినట్లు చెప్పారు. ఐటీడీఏ ద్వారా గిరిజనుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో భూభారతి చట్టం ల్యాండ్ మార్క్‌గా నిలుస్తుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ అన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం కోర్టులకు వెళ్లాల్సిన పని లేదన్నారు. పైలెట్ ప్రాజెక్టు మండలాల స్ఫూర్తితో 28 జిల్లాల్లో భూభారతి అమలు చేస్తామని చెప్పారు.








