Mahaa Daily Exclusive

  నేను అలా అనలేదు నా వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారు ప్రభుత్వంపై కావాలనే తప్పుడు ప్రచారం మంత్రి కొండా సురేఖ క్లారిటీ..!

Share

మహా: తన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గులాబీ పార్టీ నేతలపై మండిపడ్డారు. ఫార్మా కంపెనీ వాళ్లు ప్రలోభాలకు గురి చేయాలని చూస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోదని చెప్పానని తెలిపారు. దానిని ఎడిటింగ్ చేసి, దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆమె, ప్రభుత్వ పథకాలు పేదలకు అందాలని మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. హన్మకొండలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. పారదర్శకంగా ప్రభుత్వం నడుపుతుంటే కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. సెక్రటేరియట్​లో తాము ఏం మాట్లాడలేని పరిస్థితి ఉందని, ఈ పరిస్థితులు తయారు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని విమర్శించారు. మంత్రులు తప్పు చేశారని ట్రోలింగ్ చేస్తున్న వాళ్లు వెంటనే ఆపకపోతే సైబర్ క్రైమ్​కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలోనే 2014కు ముందు కవిత, కేటీఆర్​ల ఆస్తులు ఎంత, ప్రస్తుతం ఎంత ఉన్నాయో బహిరంగ చర్చలకు సిద్ధమా అని వారికి సవాల్ విసిరారు. అవినీతికి పాల్పడకుండా ఇంత ఆస్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. మీరు అవినీతికి పాల్పడి, తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిని సహించబోమని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.
అసలు మంత్రి కామెంట్స్ ఏంటంటే?
వరంగల్​లోని కృష్ణా కాలనీలో బాలికల జూనియర్​ కళాశాల భవన నిర్మాణానికి ఇటీవల భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ.4.5 కోట్లతో భవనం నిర్మించేందుకు అరబిందో ఫార్మా కంపెనీ ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే ‘అనుమతుల​ కోసం కొన్ని దస్త్రాలు మంత్రుల వద్దకు వస్తుంటాయి. అలాంటి ఫైళ్లు వచ్చినప్పుడు సాధారణంగా మంత్రులు డబ్బులు తీసుకుని క్లియరెన్స్​ ఇస్తుంటారు. మేము మాత్రం మాకు రూపాయి అవసరం లేదు. స్కూల్​ను అభివృద్ధి చేస్తే చాలు’ అని కోరాం అని ఆమె వ్యాఖ్యానించారు. ఇది కాస్త వివాదాస్పదం కావడంతో తాజాగా మంత్రి కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు.