Mahaa Daily Exclusive

  టిసాట్ లక్ష్యం ఇంటింటికి ఉన్నత విద్య సాకారం చేస్తాం – ఓయూ వీసీ ప్రొ. కుమార్ మొలుగరం..!

Share

హైదరాబాద్, మహా

ఉన్నత విద్యలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలనే సంకల్పంతో, ప్రతీ ఇంటికి ఉన్నత విద్యను చేర్చాలనే టిసాట్ ఆశయంతో కలిసి పనిచేస్తామని ఉస్మానియా యునివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం అన్నారు. నేడు రిజిస్ట్రార్ ఇతర ఓయూ అధ్యాపక బృందంతో కలిసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలోని టిసాట్ చానల్ ను సందర్శించారు. టిసాట్ స్టూడియోలను కలియ తిరిగిన వీసీ అక్కడి అధునాతన టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్, స్టూడియోలు, పొస్ట్ ప్రొడక్షన్ యూనిట్, కెమెరాలు, డిజిటల్ బోర్డులను స్వయంగా తిలకించారు, గతంలో కుదిరిన ఎంఓయూ ప్రకారం టిసాట్ తో కలిసి విసృతంగా పనిచేస్తామని ఈ సందర్భంగా వీసీ తెలియజేసారు. దేశంలోనే డిజిటల్, ఆన్లైన్, శాటిలైట్ మాధ్యమాల ద్వారా అత్యుత్తమ కంటెంటును అందిస్తున్న ఏకైక ఛానల్ టిసాట్ మాత్రమే అన్నారు, రాబోయే రోజుల్లో టిసాట్ మాద్యమంగా ఉన్నత విద్యకు సంబందించిన నాణ్యమైన కంటెంటును రూపొందించి విద్యార్థులకు అందిస్తామని, ఇందకోసం ప్రతిష్టాత్మక ఓయూ కు చెందిన వివిధ సబ్జెక్టు నిపుణులతో టిసాట్ వేదికగా కార్యక్రమాల రూపకల్పనకు ఓయూ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. దేశంలో అత్యధిక శాతం ఉన్న యువత ఈ కార్యక్రమాలను వినియోగించుకోవాలని వీసీ కోరారు.

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా టిసాట్ కృషి

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విద్యను అందరికీ చేర్చేందుకు టిసాట్ కృషి చేస్తుందని, మూడవ తరగతి నుండి పీజీ వరకూ అకడమిక్ కంటెంట్ తో పాటు, కానిస్టేబుల్ మొదలు గ్రూప్స్ వరకూ కాంపిటేటివ్ పరీక్షలకు సంపూర్ణమైన కంటెంటును అందిస్తుందని టిసాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి అన్నారు. టిసాట్ ఆహ్వానం మేరకు స్టూడియోను సందర్శించిన ఓయూ వీసీ, ఇతర అధ్యాపక బృందానికి కృతజ్ణతలు తెలిపారు ఉస్మానియా సహా పలు ప్రతిష్టాత్మక యూనివర్శిటీలతో టిసాట్ ఎంఓయూ కుదుర్చుకుని అత్యుత్తమ కంటెంటును అందిస్తుందని, రాబోయే రోజుల్లో ఓయూతో కలిసి మరింత విసృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నత విద్యను ప్రతీ ఇంటికి చేర్చే లక్ష్యాన్ని సాధిస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ఈ దిశలో ప్రతీ యూనివర్శిటిని టిసాట్ ఆహ్వానిస్తుందని, వారి భాగస్వామ్యాన్ని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, టిసాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డిలతో పాటు, ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.జి.నరేష్ రెడ్డి, వీసీ ఓఎస్డి ప్రొ. జితేందర్ కుమార్ నాయక్, ఓయూ యూజీసీ అపైర్స్ డీన్ ప్రొ. లావణ్య, ఈఎంఆర్సీ డైరెక్టర్ రఘుపతి తదితరులు పాల్గొన్నారు.