Mahaa Daily Exclusive

  హరీశ్ ఇంటికి వెళ్లిన కేటీఆర్ రెండు గంటల పాటు కీలక చర్చలు కవిత వ్యవహారశైలిపైనే ప్రధాన చర్చ పార్టీలో తన బాధ్యత ఏంటో తేల్చమని వార్నింగ్ ఇచ్చిన కవిత..!

Share

హైదరాబాద్, మహా: తెలంగాణ రాజకీయాల్లో, బీఆర్ఎస్ లో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మాజీ మంత్రి హరీశ్ రావు ఇంటికి వెళ్లారు. ఆయనతో రెండు గంటల పాటు ఏకాంతంగా చర్చలు జరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికా వెళ్ళిన సమయంలో కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళి ఎన్నడూ లేని రీతిలో రెండుగంటలకు పైగా చర్చలు జరపడం ఆసక్తిగా మారింది. ఇటీవలే హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ కు పార్టీ పగ్గాలు ఇస్తే స్వాగతిస్తానని, తన దారి కేసీఆర్ దారేనని తేల్చిచెప్పారు. కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు చేసిన 48 గంటల తర్వాత స్వయంగా కేటీఆర్ హరీశ్ ఇంటికి వెళ్లడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మాజీ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సరిగ్గా అమెరికా పర్యటనకు బయలుదేరుతున్న సమయంలో గులాబీ పార్టీలోని కీలక నేతలు భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

చిచ్చుపెట్టిన వరంగల్ సభ

బీఆర్ఎస్ పార్టీలో కొంతకాలంగా ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఎల్కతుర్తిలో జరిగిన రజతోత్సవ సభల పర్యవేక్షణ బాధ్యతలను తొలుత హరీశ్ కు కేసీఆర్ అప్పగించారు . తర్వాత ఆయనను తప్పించారు. ఈ క్రమంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో హరీశ్ రావు పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని మీడియా ముఖంగా క్లారిటీ ఇచ్చారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై లీగల్ చర్యలకు దిగుతానని కూడా హెచ్చరించారు. అదే సందర్భంగా కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని అన్నారు. కేసీఆర్ మాటే శిరోధార్యం అని, ఆయనతో చివరివరకు ఉంటానని తెగేసి చెప్పారు. ఆయన లైన్ లోనే కొనసాగుతానని పార్టీ మార్పు వార్తలను ఖండించారు. ఎమ్మెల్సీ కవిత ను పూర్తిగా పక్కనపెట్టారన్న ప్రచారం నేపథ్యంలో సభ గడువు దగ్గరపడ్డాక కవితతో మీటింగ్ పెట్టి.. మహిళల సమీకరణ బాధ్యత అప్పగించారు. అయితే స్టేజీ వద్ద ఎక్కడా కేటీఆర్ మినహా హరీష్, కవిత కటౌట్లు, ప్రచార చిత్రాలు పెట్టలేదు. పూర్తిగా కేసీఆర్, కేటీఆర్ బొమ్మలతోనే సభ జరిగింది. సభ కోసం కష్టపడ్డ కవిత ఆ తర్వాత మరిన్ని అవమానాలకు గురయ్యారు.

తాడోపేడో

గత కొద్దిరోజులుగా పార్టీలో, సోషల్ మీడియాలో తనకు జరుగుతున్న అవమానాలపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆమె ఇటీవలే చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా చర్చకు వస్తున్నాయి. హరీశ్ రావు ప్రెస్ మీట్ కు ఒక రోజు ముందే అంటే ఈ నెల 12న కవిత మాట్లాడుతూ.. ఆరునెలలు జైల్లో ఉన్నది చాలదా..? ఇంకా ఎన్ని రోజులు కష్టపెడతారంటూ కామెంట్ చేశారు. కొందరు తనపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపడ్తాయంటూ కామెంట్ చేశారు. కవితను కష్టపెడుతున్నది ఎవరు అన్న చర్చ జరుగుతున్న తరుణంలోనే మరుసటి రోజు హరీశ్ రావు ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని చెప్పడం గమనార్హం. ఇది జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా హరీశ్ రావు ఇంటికి వెళ్లడం, రెండు గంటల పాటు భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. తనకు పార్టీలో ఏ బాధ్యత అప్పగిస్తారో తేల్చాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. తాను డాటర్ ఆఫ్ ఫైటర్ అని, తనలో పోరాట స్ఫూర్తి మిగిలే ఉందని.. ఆరు నెలలు జైల్లో ఉన్నానని, తనను నమ్ముకున్న వారి కోసం ఎలాంటి పోరాటానికైనా రెడీ అంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా మహిళా విభాగ పగ్గాలను కవితకు అప్పగించాలన్న డిమాండ్ ఆమె అనుచరులవైపు నుండి వినబడుతోంది. ఈ క్రమంలో మళ్ళీమళ్ళీ అవమానాలు ఎదురైతే కవిత ఊరుకునే పరిస్థితిలో లేదని కేటీఆర్ కు అర్ధమయ్యేలా సమాచారం పంపినట్లు తెలిసింది. పరిస్థితుల్లో మార్పు లేకుంటే కవిత తన ప్రయాణం తాను చూసుకునే అవకాశాలు ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కవిత ఇప్పటికే తన రాజకీయ వ్యూహం, భవిష్యత్తు రచించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కవిత కట్టడి, పార్టీ కమిటీలు, భవిష్యత్ వ్యూహంపై తాజా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయవర్గాల్లో ఈ భేటీ ఆసక్తికర చర్చలకు దారితీసింది. హరీష్ రావు పార్టీ పెట్టబోతున్నారని, ఆయనను ఆపేందుకు కేటీఆర్ హరీష్ ఇంటికి వెళ్ళారంటూ ప్రభుత్వవిప్ రామచంద్రునాయక్ ఆరోపణలు చేశారు.
….