Mahaa Daily Exclusive

  హాస్పిటల్‎లో అందగత్తెలు.. ఏఐజీ హాస్పిటల్, పిల్లలమర్రి, ఎక్స్​పీరియం ఎకో పార్క్ సందర్శన చికిత్స పొందుతున్న చిన్నారులు, వృద్ధులతో ఆత్మీయంగా పలకరింపులు..!

Share

మహా: ప్రపంచ సుందరీమణులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమ పర్యటనలో భాగంగా, మిస్ వరల్డ్ 2025 పోటీదారులు శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రముఖ ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో వారు ముచ్చటించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడిన అనంతరం, వారి ఆరోగ్య పరిస్థితి, వారికి అందుతున్న వైద్య సేవల గురించి అక్కడి వైద్యులను అడిగి వివరాలు సేకరించారు. మిస్ వరల్డ్ పోటీదారుల సందర్శన ఆసుపత్రిలోని రోగులకు, సిబ్బందికి కొంత ఉత్సాహాన్ని, మానసిక సాంత్వనను కలిగించింది. వారి పర్యటన సామాజిక సేవా దృక్పథాన్ని ప్రతిబింబించేలా సాగింది.
పిల్లలమర్రి, ఎక్స్​పీరియం ఎకో పార్క్ విజిట్..
అలాగే మిస్ వరల్డ్ పోటీ దారులు మహబూబ్ నగర్ జిల్లాకు చేరకున్నారు. అక్కడ పిల్లల మర్రిని సందర్శించారు. ఏడు వందల ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రి చెట్టు గురించి వారికి అధికారులు వివరించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకున్న అందాలభామలకు బతుకమ్మ ఆటలతో స్వాగతం పలికారు. ఇరవై దేశాలకు చెందిని సుందరీమణులు సందర్శించారు. చెట్టుచరిత్రను గురించి అడిగి మరీ తెలుసుకుని అక్కడ ఫొటోలకు పోజులిచ్చారు. అక్కడ ఉన్న పురావస్తు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి విశిష్టతలను గురించి అధికారులు సుందరీమణులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి.. జిల్లా ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, జీఎంఆర్, వీర్లపల్లి శంకర్, చిట్టెం పరిణికా రెడ్డి పాల్గొన్నారు. 16వ శతాబ్దం నాటి రాజరాజేశ్వర సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ విశిష్టతను మిస్ వరల్డ్ పోటీదారులకు చరిత్రకారుడు శివ నాగిరెడ్డి వివరించారు. ఆలయ ప్రాంగణంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో సేకరించిన పలు విగ్రహాల విశిష్టతను గురించి తెలిపారు. హైదరాబాద్ శివార్లలో ఉన్నగండిపేట లో ఉన్న ఎకో పార్కుకు అందాల భామలు చేరుకున్నారు. వారికి తెలంగాణ బరాత్ స్టయిల్లో స్వాగతం పలికారు. అక్కడ మొక్కలు నాటేందుకు సుందరీమణులు సిద్ధమయ్యారు. అందాల భామల పర్యటనకు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆ తరువాత పార్క్‌లోని సన్‌డౌనర్ పాయింట్, బుద్ధ ఇన్‌సైడ్ ట్రీ స్పాట్, రెడ్ టెయిల్ ఫార్మేషన్ స్పాట్, ఓవల్ ట్రీ స్పాట్, ఈజిప్షియన్ రాక్ స్పాట్ వంటి ప్రదేశాలను సుంద‌రీమ‌ణులు సందర్శించారు. పార్క్ దార్శనికత, అమలు పట్ల తమ విస్మయం, ప్రశంసలను వ్యక్తం చేశారు.