హైదరాబాద్, మహా
నాలుగు రోజులుగా రాష్ట్రంలో కవిత రాజకీయ అడుగులే హాట్ టాపిక్. కవిత రాసిన లేఖ బయటపడటంతో బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలున్నాయన్న విషయం తేటతెల్లమైంది. కవిత కొత్త పార్టీ పెడుతుందన్న ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా ఊపందుకుంది. కేసీఆర్ దేవుడే అయినా.. ఆయన చుట్టూ దెయ్యాలున్నాయనడంపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ దెయ్యాలెవరు? ఆమె ఎవరిని ఉద్దేశించి లేఖలో అలా రాశారన్న విషయం చర్చనీయాంశమైంది. కాగా.. తాజాగా బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యులు దామోదరరావు సోమవారం కవితతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇంచార్జ్ గండ్ర మోహనరావు కూడా కవితతో సమావేశమయ్యారు. సుమారు మూడు గంటలపాటు ఈ భేటీ కొనసాగింది. కేసీఆర్ ఆదేశాలతో ఈ భేటీ జరగ్గా, భేటీలో కవితతో వారిద్దరూ ఏం మాట్లాడారు? ఏయే అంశాలపై ప్రస్తావించారన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆస్తులకు సంబంథించిన అంశాలపై చర్చ జరిగిందా? కొత్త పార్టీ ఆలోచన విరమించుకోవాలని సూచించారా? లేక కవిత రాజకీయ ప్రయాణానికి కేసీఆర్ సూచించిన ప్రతిపాదనలను ఆమె ముందుంచారా? ఇంతకూ ఈ భేటీ లో ఏం జరిగిందనేది స్సష్టత రావాల్సి ఉంది.








