ఢిల్లీ, మహా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై హైకమాండ్ పూర్తిస్థాయి లో దృష్టి పెట్టింది. అంతా సెట్ అయింది.. ఇక ప్రకటనే తరువాయి అని భావించినా అగ్రనేతలు తుది నిర్ణయానికి మరో డేట్ ఫిక్స్ చేశారు. ఈనెల 30న మరోసారి ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి కి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు హైకమాండ్ సూచించింది. ఆ రోజే.. పదవుల లెక్క తేలిపోనుంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్‌గౌడ్ సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. సోమవారం టీపీసీసీ కార్యవర్గానికి ఆమోదముద్ర పడుతుందని భావించినా, అనూహ్యంగా వాయిదా పడింది. కాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మర్యాద పూర్వకంగా కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిసి, తెలంగాణ రాష్ట్ర అంశాలను రాహుల్ గాంధీకి వివరించారు. వీలైనంత త్వరగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయాలని రాహుల్ గాంధీని కోరానని.. త్వరగా చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని మహేష్ కుమార్ అన్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే ఒకటి, రెండుసార్లు తమ అభిప్రాయాలను అధిష్టానానికి తెలిపామని అన్నారు. తెలంగాణ కేబినెట్‌లో బీసీలకు ప్రాధాన్యం కల్పించాలని అధిష్టానానికి కోరామని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అందుబాటులో లేకపోవడంతో పీసీసీ కార్యవర్గ ప్రకటనను 30కి వాయిదావేశారు. ఆ రోజే మంత్రివర్గం, టీపీసీసీ లపై హైకమాండ్ లెక్క తేల్చేయనుంది.
తుది కసరత్తులో కేసీ వేణుగోపాల్
రాష్ట్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. సోమవారం క్లారిటీ వస్తుందని భావించినా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిజీబిజీగా ఉండటంతో మంత్రి వర్గ విస్తరణపై స్పష్టత నాలుగైదురోజులు వాయిదాపడింది. పీసీసీ కార్యవర్గంపై ఇప్పటికే ఒక క్లారిటీ ఉంది.అయినా ఖర్గే వచ్చాకే పీసీసీ కార్యవర్గాన్ని ఫైనల్ చేయనున్నారు. హైకమాండ్ సూచనల నేపథ్యంలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వరుసగా కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. కొత్తగా మంత్రివర్గంలో చోటుదక్కించుకునే ఆ లక్కీ సిక్స్ హ్యాండ్స్ ఎవరనే చర్చ నడుస్తోంది. రేసులో వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి, పీ సుదర్శన్ రెడ్డి పేర్లు వినిపిస్తుండగా ప్రస్తుతం ఎమ్మెల్సీ, సినీనటి విజయశాంతి పేరు కూడా తెరమీదకు వచ్చింది. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి తనకు కేటాయించాలని ఆమె అధినాయకత్వాన్ని కోరుతున్నట్టు సమాచారం. ఈ వర్గంలో ఆది శ్రీనివాస్ కూడా ఆశిస్తున్నారు. మరోవైపు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు తమలో ఒకరికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయుగ్ సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు ప్రధాని, మంత్రులను కలుస్తున్నారు. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ని కలిశారు. సుమారు గంట పాటు పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించారు. అయితే ఖర్గే అందుబాటులో లేకపోవడంతో ఈనెల 30న తెలంగాణకు సంబంధించిన కీలక పదవులపై చిక్కుముడులు విప్పేసి ఆమోదముద్ర వేస్తామని హైకమాండ్ తేల్చిచెప్పింది. 30న ఫైనల్ అయితే మే 31 లేదా జూన్ 2న మంత్రివర్గ విస్తరణ జరగనుంది.








