పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై కక్షతో ఆయన నటించిన సినిమాపై వైసీపీ నాయకుడు, మాజీ సినిమాటోగ్రఫీ శాఖామంత్రి పేర్ని నాని కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ ఆరోపించారు.
“పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం “హరిహర వీరమల్లు” విడుదలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఇంకా సెన్సార్ జరుపుకోలేదు, థియేటర్లలో విడుదల కాలేదు. అలాంటప్పుడు పేర్ని నాని ఆ సినిమాను ఫ్లాప్ సినిమా అంటూ ఎలా కామెంట్స్ చేస్తారు. ఒక సినిమా పూర్తి కావాలంటే ఎంతో మంది కళాకారుల, సాంకేతిక నిపుణుల శ్రమ, క్రియేటివిటీ అందులో దాగి ఉంటుంది. నిర్మాత కోట్లాది రూపాయల బడ్జెట్ ను వెచ్చించడం జరుగుతుంది. అయితే పేర్ని నాని మాత్రం కేవలం కుట్ర, కక్ష పూరితంగా సినిమాను డేమేజ్ చేస్తున్నారు. ఒక సినిమాను రిలీజ్ కాకముందు కామెంట్స్ చేసే రైట్స్ ఆయనకు ఎవరు ఇచ్చారు?. దీనిపై చిత్ర నిర్మాత ఎ.ఎం.రత్నం కేసు పెట్టాలి. ఇకపై విడుదల కాబోతున్న సినిమాపై పేర్ని నాని లాగా ఇంకెవరూ విష ప్రచారం చేయకుండా తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించాలి. ఈ కుట్రపై ప్రభుత్వం తగిన విచారణ జరిపి, పేర్ని నానిపై కఠిన చర్యలు చేపట్టాలి” అని నట్టి కుమార్ డిమాండ్ చేశారు








