మహా: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత అంశాలపై మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తనను తాను ఓ చక్రవర్తిలా, రాజులా భావిస్తుంటాడు.. ఒక్కసారి ఎవరిపైనైనా ఆయనకు నెగిటివ్ అభిప్రాయం పడితే ఇక అంతే. అది ఎన్నటికీ మారదని అన్నారు. కేసీఆర్తో కవిత బంధం ఇక అతికే అవకాశమే లేదు’ అని వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు. కేసీఆర్, కవితల బంధం ఇక ముగిసినట్లేనని ఆయన పరోక్షంగా తేల్చిచెప్పారు. కేసీఆర్కు ఎదురుచెప్పే వారు ఆ తర్వాత ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేరని వివరించారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి దాదాపు 20 సంవత్సరాలుగా కేసీఆర్ వెన్నంటే ఉన్నానని, ఆయనను చాలా దగ్గరి నుంచి చూసిన వ్యక్తిగా తాను ఈ మాటలు చెబుతున్నానని పేర్కొన్నారు. కేసీఆర్కు మనం ట్యూన్ కావాల్సిందే తప్ప ఆయన మనకు ట్యూన్ కారని.. కూలిపోయే వరకు నేనే గొప్ప అనుకునే వ్యక్తి కేసీఆర్ అన్నారు. వాస్తవాన్ని అంగీకరించే మూడ్ లో కేసీఆర్ లేరని చెప్పారు.
ఎక్కడున్నా సరే వదిలిపెట్టడు..
ఆయన ఛట్రంలో ఇమడని వారిని కేసీఆర్ దగ్గరకు రానివ్వరని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రాచరికపు పోకడ, నియంతృత్వం, నమ్ముకున్న వారిని నట్టేట ముంచే పద్ధతి, వ్యక్తులను వాడుకుని వదిలేసే నైజం ఫలితమే రాజకీయంగా కేసీఆర్ ను బొందపెట్టిందని చెప్పారు. కవితకు వాళ్ల కుటుంబానికి మధ్య ఎక్కడో ఏదో తేడా వచ్చిందని ఇక అతికే అవకాశమే లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎవరినైనా టార్గెట్ చేస్తే మరో పని పెట్టుకోడని, తను టార్గెట్ చేసిన వ్యక్తి అంతుచూసేదాకా వదలడని ఈటల చెప్పారు. అది ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే వదలిపెట్టడని అన్నారు. ఒకవేళ అవసరార్థం మళ్లీ దగ్గరికి తీసినా సరే సమయం వచ్చినపుడు తొక్కేస్తాడని తేల్చిచెప్పారు. ఒకసారి విభేదాలు పొడచూపితే వాటిని మర్చిపోయి కలిసి ముందుకు సాగే వ్యక్తి కాదని పేర్కొన్నారు. కూలిపోయే పరిస్థితి వచ్చినా సరే నేనే గొప్ప అనుకునే వ్యక్తి కేసీఆర్ అని ఈటల తెలిపారు. వాస్తవాన్ని అంగీకరించే మూడ్లో కేసీఆర్ లేరని ఈటల వివరించారు.








