Mahaa Daily Exclusive

  11 ఏళ్లుగా దేశంలో ‘అప్రకటిత ఎమర్జెన్సీ ఇబ్బందుల్లో 140 కోట్ల మంది ప్రజలు మోదీ పాలనపై విమర్శలు గుప్పించిన ఖర్గే..!

Share

మహా : కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చి మే26 నాటికి 11 ఏళ్లు పూర్తైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. అప్రకటిత అత్యవసర పరిస్థితి 11ఏళ్లు పూర్తి చేసుకుందని ఎద్దేవా చేసింది. మోదీ ‘అచ్ఛే దిన్’ వాగ్దానం పీడకలగా మిగిలిపోయిందని విమర్శించింది. మోడీ పాలన వల్ల గత 11ఏళ్లుగా 140 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. గత 11ఏళ్లలో ఇచ్చిన వాగ్దానాలేవి మోదీ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. దేశాన్ని నాశనం చేశారని విరుచుకుపడ్డారు. అచ్ఛే దిన్ అనే వాగ్దానం ఇప్పుడు పీడకలగా మారిపోయిందని పేర్కొన్నారు. యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీ నెరవేర్చలేదన్నారు. వాస్తవానికి కోట్లాది ఉద్యోగాలు పోయాయని తెలిపారు. రైతుల ఆదాయం రెట్టింపు కాలేదని, పైగా రైతులు రబ్బరు బుల్లెట్లను ఎదుర్కోవలసి వచ్చిందన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు కాలేదని, వారికి దేశంలో భద్రతే లేదన్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై భయంకరమైన దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ బాగాలేదని, ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది, నిరుద్యోగం పెరిగిపోయిందని ఖర్గే ఎక్స్ పోస్ట్​లో పేర్కొన్నారు.

దేశంలో వినియోగం స్తంభించిపోయింది, మేక్ ఇన్ ఇండియా విఫలమైంది, అసమానతలు పెరిగిపోయాయి, విశ్వగురుగా మారతానని మోదీ వాగ్దానం చేశారు కానీ ఇప్పుడు ప్రతి దేశంతో సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. ప్రజాస్వామ్యంపై ఆర్ఎస్ఎస్ దాడి చేస్తోందని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తున్నారని, కేంద్ర సంస్థల స్వయంప్రతిపత్తి నాశనమైందన్నారు. మోదీ సర్కార్ 11 ఏళ్ల పాలనలో దేశంలోని ప్రతి వర్గం ఇబ్బంది పడుతోందని ఖర్గే తన పోస్ట్​లో ఆరోపించారు.

మోదీ ‘హ్యాట్రిక్’

భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ తొలిసారి 2014 మే 26 ప్రమాణం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పాలనే కేంద్రంలో నిరాంటంకంగా కొనసాగుతోంది. 2014, 2019, 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో అఖండ విజయాలను నమోదు చేసి వరుసగా మూడు సార్లు ప్రధాని పీఠాన్ని మోదీ అధిరోహించారు. అప్రతిహతంగా దూసుకెళ్తున్న మోదీ పాలన నేటితో 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో మోదీ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది.