మహా : పాకిస్థాన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ దేశం ఏకైక లక్ష్యం భారత్‌ను ద్వేషించడం, మనకు హానికలిగించే మార్గాల గురించి ఆలోచించడమేనని మండిపడ్డారు. కానీ, భారత్ మాత్రం దేశంలోని పేదరికాన్ని నిర్మూలించి ఆర్థికాభివృద్ధి సాధించే లక్ష్యంతో ముందుకెళ్తోందన్నారు. సోమవారం గుజరాత్‌లోని దాహోద్‌లో రూ. 24వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ ఇటీవల భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసించిన ప్రధాని మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచిపెట్టే దుస్సాహసానికి ఒడిగట్టిన వారి ముగింపు దగ్గరపడినట్లేనని తెలిసేలా చేశామన్నారు. దేశ విభజన తర్వాత ఏర్పాటైన పాకిస్థాన్ భారత్ పట్ల ద్వేషంతో బతుకుతోందని, మనకు హాని చేయాలనుకుంటోందని మండిపడ్డారు. కానీ, భారత్ మాత్రం పేదరిక నిర్మూలన, ఆర్థికాభివృద్ధి సాధించడం, అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడమే లక్ష్యంగా నిర్దేశించుకొని ముందుకెళ్తోందని చెప్పారు.
2014లో ఇదేరోజు తొలిసారి పీఎంగా బాధ్యతలు చేపట్టానని నరేంద్రమోదీ గుర్తుచేసుకున్నారు. తొలుత గుజరాత్ ప్రజలు తనను ఆశీర్వదించారని, తర్వాత కోట్లాది మంది భారతీయులు ఆశీస్సులు అందించారని వ్యాఖ్యానించారు. ఈ పర్యటనలో దాహోద్‌లో వేల కోట్లు రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. వెరావల్-అహ్మదాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్, వల్సాద్-దాహోద్‌ల మధ్య ఎక్స్‌ప్రెస్ రైలుకు జెండా ఊపారు. ఎలక్ట్రిక్ లోకోమోటివ్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ‘‘దేశాన్ని వికసిత్ భారత్ దిశగా మార్చేందుకు 140 కోట్ల మంది ప్రజలు ఐక్యంగా పనిచేస్తున్నారు. ఈ 11 ఏళ్లలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. దశాబ్దాల నాటి సంకెళ్లను బద్దలు కొట్టి, దేశాన్ని తయారీ కేంద్రంగా మార్చుతున్నాం. కార్లు, ఫోన్లు, బొమ్మలు, ఆయుధాలు ఎగుమతి చేస్తున్నామన్నారు. మూడు సంవత్సరాల క్రితం ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశాను. దీనిపై ఎన్నో విమర్శలు వినిపించాయి. ఎన్నికల సమయం కాబట్టి ప్లాంట్‌కు పునాది వేశారు కానీ ఏ నిర్మాణాలు చేపట్టరని విమర్శించారు. కానీ ఈ రోజు ఇక్కడ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ తయారైంది. అది మనకు కనిపిస్తోంది’’ అని మోదీ అన్నారు. అనంతరం రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ‘‘2022లో ఆధునిక ఎలక్ట్రిక్ ఇంజిన్లను తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 2023లో ఆ దిశగా పని మొదలైంది. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ సిద్ధమైంది’’ అని వెల్లడించారు.
వేదికవద్దకు చేరుకోవడానికి ముందు మోదీ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేశారు. ఆ ర్యాలీలో కర్నల్ సోఫియా ఖరేషీ కుటుంబం పాల్గొంది. వారు మోదీపై పూలు చల్లి ఘనస్వాగతం పలికారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను మీడియాకు వివరించడంతో సోఫియా పేరు వార్తల్లో నిలిచింది.








