Mahaa Daily Exclusive

  విద్యుత్ కార్మికులకు కోటి ప్రమాద భీమా దేశ చరిత్రలోనే ఓ రికార్డు ప్రభుత్వ ఆలోచనకు అద్దం పడుతుంది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ..!

Share

మహా : విద్యుత్ కార్మికులకు కోటి రూపాయలకు పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ప్రజాభవన్ లో ఎన్ పీడీసీఎల్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగు నరేష్ కుటుంబ సభ్యులకు కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కు తో పాటు విద్యుత్ శాఖలో నరేష్ భార్యకు కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేసిన సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రసంగించారు. విద్యుత్ కార్మికునికి కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును అందించడం కేవలం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వంలోని సాధ్యమైందన్నారు. గతంలో కార్మికుల కోసం ఏ ప్రభుత్వం ఇంత గొప్పగా ఆలోచన, ప్రయత్నం చేయలేదని తమ ప్రభుత్వం వచ్చాకే ఇది సాధ్యం అయింది అన్నారు. ప్రమాద బీమా మరియు కారుణ్య నియామక పత్రం అందించడం ప్రభుత్వ ఆలోచనకు, కార్యాచరణకు, మానవీయ కోణానికి అద్దం పడుతుంది అన్నారు. కార్మికులకు ప్రమాద బీమా పథకాన్ని మొదట సింగరేణిలో ప్రవేశపెట్టి అనంతరం విద్యుత్ సంస్థల్లోనూ ఆచరణలోకి తీసుకువచ్చిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. కోటి రూపాయల పైబడి ప్రమాద బీమా విద్యుత్ సంస్థలో పనిచేసే కార్మికుల అందరిలో ఓ కొత్త భరోసా నింపుతుంది అన్నారు. విద్యుత్ ఉద్యోగులు అంకితభావంతో రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డిప్యూటీ సీఎం కోరారు. ప్రభుత్వ ఆలోచనను సమర్థవంతంగా అమలు చేసిన సీఎండీ వరుణ్ రెడ్డిని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి విద్యుత్తు, బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.