Mahaa Daily Exclusive

  రాహుల్‌ ప్రధానిగా ఉండి ఉంటే పాక్‌ను రెండు ముక్కలు చేసేవారు. రాహుల్‌ ప్రధానిగా ఉండి ఉంటే పీవోకేను లాక్కొనేవారు.’ రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం..!

Share

మహా: అమెరికా అధ్యక్షుడు డోనాన్డ్ ట్రంప్‌ బెదిరించగానే మోదీ ఎందుకు తలొగ్గారని, ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం.. మీ సొంత వ్యవహారం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దేశ భద్రత విషయంలో అందరం ఏకమవ్వాలని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాలకు అండగా నిలిచామని గుర్తు చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గంలో గురువారం జై హింద్ యాత్ర నిర్వహించారు. బాచుపల్లి వీఎన్​ఆర్​ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కేజేఆర్ కన్వెన్షన్ వరకూ జైహింద్ యాత్ర కొనసాగింది. ఈ ర్యాలీలో సీఎం రేవంత్‌ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జై హింద్ యాత్ర అనంతరం నిజాంపేట కొలన్ గోపాల్‌రెడ్డి కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. భారత్‌పై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారని ధ్వజమెత్తారు. ఉగ్రవాదులను తుదముట్టించే వరకూ సైన్యానికి అండగా ఉంటామని తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కుట్ర చేసి కొడంగల్‌లో తనను ఓడిస్తే.. 14 రోజుల్లోనే మల్కాజ్‌గిరిలో ఎంపీగా ప్రజలు గెలిపించారని ఉద్ఘాటించారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎంపికయ్యానని.. ఇప్పుడు తెలంగాణ సీఎంగా ప్రజల ముందుకువచ్చానని గుర్తు చేసుకున్నారు. పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పే విషయంలో కేంద్రానికి సహకరించామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.
దేశానికి ఆయనే అవసరం..
యుద్ధం అంటే ధైర్యం, వెన్నెముక, యుద్ధతంత్రం ఉండాలని చెప్పుకొచ్చారు. నాలుగు రోజుల యుద్ధం తర్వాత అర్ధాంతరంగా ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు. యుద్ధం చేయాలనుకున్నప్పుడు అఖిలపక్షాన్ని పిలిచారని.. యుద్ధం ఆపేసినప్పుడు అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తారని తెలిపారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి యుద్ధాన్ని అర్ధాంతరంగా ఆపేశారా? అని నిలదీశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మీడియా ముందుకు వచ్చి యుద్ధం ఆపానని ప్రకటించారని గుర్తు చేశారు. పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. పీవోకేను స్వాధీనం చేసుకోవాలని మోదీతో తాము చెప్పామని అన్నారు. 1971 యుద్ధంలో పాకిస్థాన్‌ను ఓడించామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. భారత్‌ వైపు ఎవరు కన్నెత్తి చూసినా కనుగుడ్లు పీకేస్తామని.. చైనాకు ఇందిరాగాంధీ వార్నింగ్‌ ఇచ్చారని తెలిపారు. గతంలో యుద్ధం ఆపాలని ఇందిరా గాంధీని అప్పటి అమెరికా అధ్యక్షుడు బెదిరించారని, గాంధీ అమెరికా బెదిరింపులకు లొంగలేదని చెప్పారు. నాటి ఇందిర యుద్ధతంత్రాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, ఇందిరా గాంధీని ప్రధాని మోదీ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. 1967 చైనా, 1971లో పాకిస్థాన్‌ని ఓడించినందుకా కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. మోదీకి వీరతిలకం దిద్ది పాకిస్థాన్‌‌పై యుద్ధం చేయాలని చెబితే.. ఎందుకు వెనుకడుగు వేశారో బీజేపీ నేతలే చెప్పాలని డిమాండ్ చేశారు. భారతీయుల ఆత్మగౌరవాన్ని ట్రంప్‌ దగ్గర తాకట్టు పెడతారా? అంటూ ప్రశ్నించారు. యుద్ధం అంటే ఉపన్యాసాలు చెప్పడం కాదని, దేశ ప్రజలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలన్నారు. తాము నిర్వహించిన ర్యాలీ ఎన్నికలు, ఓట్ల కోసం కాదు.. సైనికుల ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం నిలబెట్టడానికన్నారు. కాలం చెల్లిన రూపాయి ప్రధాని మోదీ అని, దేశానికి రాహుల్‌‌ గాంధీ నాయకత్వం అవసరం అంటూ దుయ్యబట్టారు. బలూచిస్థాన్‌ను విడగొట్టి మరో దేశంగా చేయమన్నామని, ఇది చేతకాదు కానీ.. కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. యుద్ధంలో ఎన్ని రఫెల్‌ విమానాలు నేలకూలాయో లెక్క చెప్పాలని సవాల్ విసిరారు. పాక్‌ను ఓడించాలంటే ఇందిరాగాంధీ మార్గంలో నడవాలని ప్రధాని మోదీకి సూచించామంటూ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.