మహా: పహల్గామ్ ఘటన నేపథ్యంలో మాజీ ప్రధాని ఇందిరమ్మ స్ఫూర్తిని దేశంలో ప్రతి ఒక్కరూ గుర్తు తెచ్చుకున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పాకిస్థాన్‌పై వీరోచిత పోరాటం చేసిన సైనికులకు సెల్యూట్ చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. గురువారం జై హింద్ యాత్ర అనంతరం మేడ్చల్ సభలో మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సైనికులు ఫైట్ చేశారని, పాకిస్థాన్‌లోకి వెళ్లి తీవ్రవాద సంస్థలను ధ్వంసం చేసిన భారత సైనికుల పోరాట పటిమ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. దేశ సార్వభౌమ అధికారానికి భంగం కలిగించాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తే అపర ఖాళీ మాత ఇందిరాగాంధీ పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పి బంగ్లాదేశ్‌ను ఏర్పాటుకు కృషి చేశారన్నారు. ఇందిరా గాంధీని సాక్ష్యాత్తు పార్లమెంటులోనే బీజేపీ నాయకులు గురుతుల్యులుగా భావించే వాజ్ పాయ్ అపర ఖాళీ మాతగా అభివర్ణించారని గుర్తు చేశారు. ట్రంప్ చెబితే కాల్పుల విరమణ చేయడం ఏమిటో? నరేంద్ర మోదీకే తెలియాలన్నారు. దేశ ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టారన్నారు.








