అక్రమ రిసార్ట్ నిర్మాణాల ఫిర్యాదుపై డిఎల్పిఓ తనిఖీలు
రిసార్ట్ పేరుతో ఆరుట్లలో అక్రమంగా నిర్మాణాలు
అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం
అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
జిల్లాలో రిసార్ట్ పేరుతో అక్రమంగా నిర్మాణాలు చేపట్టి, వాటిని అనేక రకాల ఫంక్షన్లకు అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్న నిర్వాహకులు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. దీనికి కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అక్రమ నిర్మాణాలు ఏర్పడుతున్నాయి.
హెచ్ఎండిఏ అనుమతులు..
హెచ్ఎండిఏలో అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా, హెచ్ఎండిఏలో అనుమతులు తీసుకోవడానికి భారీ మొత్తంలో డబ్బు వెచ్చించాల్సి ఉంటుందని, గ్రామస్థాయి, మండల స్థాయి, అధికారులతో కుమ్మక్కై ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి అక్రమాలకు అధికారుల అండదండలు అందిస్తుండడంతో అక్రమ నిర్మాణాలు ఏదేచ్ఛగా కొనసాగుతున్నాయి.
జిల్లా స్థాయి అధికారుల నిఘా…
రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడంతో, కొందరు అక్రమార్కులు గోరంత అనుమతులు తీసుకొని కొండంత నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలాంటి రిసాట్ల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని, వాటిపై జిల్లా స్థాయి అధికారులు, అక్రమ నిర్మాణాలపై నిఘా పెట్టాలని, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఆరుట్ల గ్రామంలో అక్రమ రిసార్ట్ నిర్మాణం…
రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, ఆరుట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ‘తెలంగాణ అరకు రిసార్ట్’ నిర్మాణ అనుమతుల విషయంలో ఆరుట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శిపై వచ్చిన ఫిర్యాదు మేరకు డిఎల్పిఓ సాధన శుక్రవారం రిసార్టును సందర్శించారు. నిర్మాణ అనుమతుల విషయంలో విచారణ చేపట్టి, జిల్లా పంచాయతీ అధికారికి తెలుపుతామన్నారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.








