Mahaa Daily Exclusive

  ఆర్‌బీఐ హ్యాట్రిక్‌ నిర్ణయం వరుసగా మూడోసారి వడ్డీ రేట్ల తగ్గింపు రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం..!

Share

మహా: ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. వరుసగా మూడోసారి వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయించింది. రెపోరేటును ఏకంగా 50 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది. దీనివల్ల రెపో రేటు 6 శాతం నుంచి 5.50 శాతానికి దిగొచ్చింది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో గృహ రుణాల వడ్డీరేట్లు 7.5 శాతం తగ్గనున్నాయి. అలాగే బ్యాంక్ ఈఎంఐలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.16 శాతంగా ఉంది. ఎస్‌బీఐ నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రెపోరేటు మరో 75 బేసిస్ పాయింట్ల తగ్గింపు జరిగే అవకాశం ఉంటుంది. దీంతో రెపో రేటు 5.0 శాతం నుంచి 5.25 శాతానికి చేరుకోవచ్చు. దీనివల్ల బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడానికి వీలుంటుంది. వడ్డీ రేట్లను తగ్గించడం ఈ ఏడాదిలో వరుసగా ఇది మూడోసారి అని చెప్పాలి. ఫిబ్రవరి, ఏప్రిల్‌లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించారు. తాజాగా మళ్లీ వడ్డీ రేట్లు తగ్గించడం ద్వారా వివిధ రకాల ప్రయోజనాలు కలగనున్నాయి. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రుణాలు తీసుకున్న వారందరికీ ఇది శుభవార్త అనే చెప్పాలి. దేశ ఆర్థిక వృద్ధిని పెంపొందించడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
ఏకగ్రీవ నిర్ణయంతో ఆమోదం
ప్రతి రెండు నెలలకోసారి జరిగే ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకున్నట్లు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రస్తుత ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి రేటు అంచనాలు, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలపై లోతైన చర్చ జరిగిన అనంతరం వడ్డీ రేట్ల తగ్గింపునకు కమిటీ సభ్యులందరూ ఆమోదం తెలిపారు. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం రుణగ్రహీతలకు, ప్రత్యేకించి ఇల్లు కొనాలనుకునే వారికి పెద్ద ఊరటనిస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.