Mahaa Daily Exclusive

  స్వామి వేషంలో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ – రూ. 15.30 లక్షల నగదు, బంగారం, 3 కార్లు, 7 సెల్ ఫోన్‌లు స్వాధీనం..!

Share

కరీంనగర్, మహా:

కరీంనగర్, జూన్ 13, 2025: అమాయక ప్రజలను స్వామి వేషంలో పూజలు చేస్తామంటూ నమ్మించి, లేనిపోని పూజల పేరుతో డబ్బు దోచుకుని, బెదిరింపులకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 15 లక్షల 30 వేల నగదు, 7 తులాల బంగారం, మూడు కార్లు (ఒక క్రెటా, ఒక బాలెనో, ఒక తార్), మరియు 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఘటన వివరాలు:
గత పదిహేను రోజుల క్రితం కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన గజ్జి ప్రవీణ్ (25) తండ్రి కనకయ్య, ఆర్టీసీ వేములవాడ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తూ ఒక ప్రమాదంలో ఎడమ కాలు విరిగింది. అతని తల్లి కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని, పది రోజుల క్రితం స్వామి వేషంలో ఉన్న ఒక వ్యక్తి గజ్జి ప్రవీణ్‌కు పరిచయమయ్యాడు.
అతను ప్రవీణ్ ఇంట్లో ఏమీ బాగోలేదని, ఇంటి పక్కనే క్వింటాల్ వరకు బంగారు కడ్డీ ఉందని, దానిని బయటకు తీసి పూజలు చేస్తే కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుందని, లేకపోతే అతని తండ్రి నెల రోజులలోపు చనిపోతాడని నమ్మబలికాడు. అందుకు పూజలు చేయాలని, కావాల్సిన పూజా సామాగ్రి కొనుగోలు చేయాలని మాయమాటలు చెప్పి, విడతలవారీగా రూ. 3 లక్షలు, రూ. 5 లక్షలు, రూ. 10 లక్షలు – మొత్తం రూ. 15 లక్షల 30 వేల నగదు గజ్జి ప్రవీణ్ వద్ద పూజల పేరుతో, పూజా సామాగ్రి పేరుతో వసూలు చేశాడు.
డబ్బులు తీసుకున్న తర్వాత, నిందితులు కొంత పూజా సామాగ్రి కొనుగోలు చేసి, ఇంటి పక్కనే ఒక గొయ్యి తవ్వి, కుంకుమ, పసుపు చల్లి, అందులో నుంచి ఒక డబ్బా(బంగారం అని నమ్మబలికి) ఇచ్చి, అందులో కిలో బంగారం ఉంటుందని చెప్పి ప్రవీణ్ ఇంటిలోని దేవుడి గదిలో పెట్టించారు. ఇంకా డబ్బులు కావాలని బెదిరింపులకు పాల్పడుతూ, “లేకపోతే మీ నాన్నను ఇక్కడే చంపి పాతిపెడతాం” అని హెచ్చరించారు. వారి బెదిరింపులకు భయపడిన ప్రవీణ్, చుట్టుపక్కల వారి వద్ద నుండి మరికొంత డబ్బు తీసుకొని వారికి ఇవ్వడం జరిగింది.

నిందితుల వివరాలు:
ఫిర్యాదుదారుడు ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ మోసానికి పాల్పడినవారు:
* ఈర్నాల రాజు (చంద్రగిరి గ్రామం)
* మిరియాల దుర్గయ్య (అగ్రహారం గ్రామం)
* పెనుగొండ రాజు (చీర్లవంచ గ్రామం)
* చల్లా అజయ్ (చీర్లవంచ గ్రామం)
* ఈర్నాల సతీష్ (చీర్లవంచ గ్రామం)
పోలీసుల దర్యాప్తు మరియు అరెస్ట్:
ఇట్టి విషయం అయి గజ్జి ప్రవీణ్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, గౌరవ కరీంనగర్ కమిషనర్ శ్రీ గౌష్ ఆలం ఆదేశానుసారం, కరీంనగర్ రూరల్ ఏసీపీ శ్రీ శుభం ప్రకాష్ పర్యవేక్షణలో కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి, కరీంనగర్ రూరల్ ఎస్సై ఏ. లక్ష్మారెడ్డి మరియు వారి సిబ్బందితో కూడిన బృందం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఈ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది.
ఈ క్రమం లో ఈరోజు మధ్యాహ్నం చింతకుంట ఎక్స్ రోడ్ వద్ద కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి బృందం వాహన తనిఖీ చేస్తుండగా, ఒక క్రెటా కారు, ఒక బాలెనో, ఒక తార్ – మొత్తం మూడు కార్లలో వేగంగా వస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు పైన చేసిన తమ నేరాన్ని ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి రూ. 15 లక్షల 30 వేల నగదు, 7 తులాల బంగారం, మూడు కార్లు మరియు 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అభినందనలు మరియు ప్రజలకు విజ్ఞప్తి:
ఈ కేసును చేధించిన కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి, కరీంనగర్ రూరల్ ఎస్సై లక్ష్మారెడ్డి మరియు వారి బృందాన్ని కరీంనగర్ కమిషనర్ శ్రీ గౌష్ ఆలం మరియు కరీంనగర్ రూరల్ ASP శుభం ప్రకాష్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా కరీంనగర్ రూరల్ ASP శుభం ప్రకాష్ మాట్లాడుతూ, పూజలు చేస్తాం అంటూ వేషాలు వేసుకుని తిరిగే నకిలీ స్వాముల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మూఢనమ్మకాలను విడనాడాలని సూచించారు. ఇటువంటి స్వామి వేషంలో మోసపోయిన ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.