Mahaa Daily Exclusive

  ఇది మాటలకు అందని విషాదం =ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం హృదయవిదారకం మీ జీవితంలో ఏర్పడిన లోటును అర్థం చేసుకోగలం: మోదీ

Share

మహా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్ పర్యటనకు వెళ్లారు. విమాన ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం విమాన ప్రమాదం కారణంగా గాయపడి ఆస్పత్రిపాలైన వారిని, విమాన ప్రమాదం నుంచి బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏకైక వ్యక్తి రమేశ్‌ బిశ్వాస్‌ కుమార్‌ పరామర్శించారు.
విజయ్‌భాయ్‌ లేరనే నిజాన్ని ఆంగీకరించలేకపోతున్నా..

విజయ్ రూపానీ ఇంటికివెళ్లి కుటుంబసభ్యులతో తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా పీఎం మోదీ.. విజయ్‌భాయ్ మన మధ్య లేరనేది ఊహించలేనిదన్నారు. తనకు దశాబ్దాలుగా ఆయన తెలుసన్న మోదీ.. భుజం భుజం కలిపి.. తామిద్దరం కలిసి పనిచేశామని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అత్యంత సవాలుతో కూడిన సమయాల్లో కూడా విజయ్‌భాయ్ వినయపూర్వకంగా కష్టపడి పనిచేసేవారని మోదీ అన్నారు. పార్టీ సిద్ధాంతానికి దృఢంగా కట్టుబడి ఉండేవారని, ఉన్నత స్థాయికి ఎదిగి, వివిధ బాధ్యతలను నిర్వహించి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంతోశ్రద్ధాశక్తులతో సేవలందించారని మోదీ కీర్తించారు.
బాధితులకు అండగా ఉంటాం..
విమానం గురువారం మధ్యాహ్నం బీజే మెడికల్‌కు చెందిన యూజీ మెస్‌ బిల్డింగ్‌పైపడి కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 242 మందికిగాను 241 మంది మరణించారు. రమేశ్‌ బిశ్వాస్‌ అనే ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అతనిప్పుడు అహ్మదాబాద్‌లోని సివిల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అదేవిధంగా ప్రమాద సమయంలో విమానం ఢీకొట్టిన బిల్డింగులో ఉన్న పలువురు కూడా మరణించారు. మరికొంత మంది గాయపడ్డారు. వాళ్లు కూడా అహ్మదాబాద్‌లోని సివిల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయం ఆస్పత్రికి వెళ్లిన ప్రధాని మోదీ వారిని పరామర్శించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధితులకు, బాధితుల కుటుంబాలకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. యావత్‌ భారత దేశం బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటోందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని తన ఎక్స్‌ ఖాతాలో ఒక పోస్టు చేశారు.