Mahaa Daily Exclusive

  బనకచర్లపై పోరులో.. ప్రభుత్వానికి మద్దతిస్తాం మంత్రి ఉత్తమ్‌కు హరీశ్ రావు లేఖ..!

Share

తెలంగాణ, మహా: తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం లేఖ రాశారు. గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్‌ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ కారణంగా గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన 200 టీఏంసీల గోదావరి నీటిని బనకచర్ల వరకు తరలించేందుకు మూడు దశల్లో ప్రాజెక్ట్ డిజైన్, కేంద్రానికి పీఎఫ్ఆర్ సమర్పించడం.. తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమేనని ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు ఆ లేఖలో స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను కేంద్రం ఆమోదించే లోపే.. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు రావాల్సి ఉండగా.. ఏపీ ఏకపక్షంగా ముందుకు వెళ్లుతుండడం అన్యాయమన్నారు. అయితే రెండు రోజుల క్రితం ఇదే అంశంపై కేంద్ర జలశక్తి మంత్రికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను ఆ లేఖలో వ్యతిరేకించడం పట్ల మంత్రి ఉత్తమ్‌ను హరీశ్ రావు పొగడ్తలతో ముంచెత్తారు. ఏపీ తీసుకుంటున్న చర్యలు.. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంతోపాటు నది జలాల బోర్డుల నియమాలను ఉల్లంఘిస్తుందని.. దీనిపై వెంటనే ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేందుకు కేంద్రాన్ని కోరాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తగు చర్యలు తీసుకోవాలని.. అలాగే రాష్ట్ర నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ మీకు తోడుగా నిలుస్తుందని ఆ లేఖలో హరీశ్ రావు స్పష్టం చేశారు.

జల్ శక్తి మంత్రిని కోరాలని విజ్ఞప్తి..
‘త్వరలోనే ప్రాజెక్టుకు టెండర్లు పిలువనున్నట్లు తెలుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టం 2014 ను ఉల్లంఘిస్తున్న కారణంగా ఈ అంశాన్ని చర్చించడానికి తక్షణమే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయమని కేంద్ర జల్ శక్తి మంత్రిని కోరాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాబట్టి బేషజాలకు పోకుండా, రాజకీయాలకు తావు లేకుండా వీలైనంత త్వరలో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, లేదా ప్రత్యేక శాసన సభా సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఈ అంశంపై ఒక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోవాలని కూడా కోరుతున్నాను. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ఆధారంగా గోదావరి జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1480 టీఎంసీల నీరు లభ్యం అవుతుందని ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి శాఖ ఇంజనీర్లు లెక్క గట్టినారు. అందులో తెలంగాణ ప్రాజెక్టులకు 969 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలోనే వివిధ జీవోల ద్వారా తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించబడినాయి. ప్రాజెక్టులకు నీటి కేటాయింపులైతే ఉన్నాయి కానీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మాణం కాకపోవడం వలన, కొన్ని ప్రాజెక్టులు పాక్షికంగా నిర్మాణమైనందున వాస్తవ వినియోగం 200 టీఎంసీలకు మించలేదన్నది వాస్తవం. తెలంగాణ రాష్ట్ర సాధనా ఉద్యమానికి సాగునీటి ఆకాంక్షలే ప్రధాన చోదక శక్తిగా ఉన్నాయని మీకు తెలియనిది కాదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో గోదావరి జలాలను సంపూర్ణంగా వినియోగించుకునే లక్ష్యంతో గోదావరి బేసిన్‌లో తెలంగాణ ప్రభుత్వం అనేక భారీ ప్రాజెక్టులను చేపట్టింది’ అని హరీశ్ రావు లేఖలో చెప్పారు.

Latest