హైదరాబాద్, మహా: నేడు తెలంగాణ కేబినెట్ మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విషయమై ఇప్పటికే కొంత స్పష్టత ఇచ్చారు. ఈ నెలాఖరున నోటీఫికేషన్ ఇచ్చి జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనిఆయన తెలిపారు. గత సమావేశంలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశం నిర్వహించాలని తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా ఇవాళ నిర్వహించనున్నారు.
రైతుభరోసాతో పాటు..
ఈ నెలలో నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే నెలలో ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. గత సమావేశంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై క్యాబినెట్ సమాలోచనలు చేసింది. వర్షాకాలం నేపథ్యంలో జూన్ -జులైలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏ మేరకు సురక్షితం అన్నదానిపై కేబినెట్ చర్చించనున్నది. అలాగే వర్షాకాల రైతు భరోసాపై ఒక నిర్ణయం తీసుకోనుంది. వీలయినంత త్వరగా ఎన్నికల లోపు రైతులందరికీ రైతు భరోసా చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఎన్నికలు ఏక్షపక్షంగా జరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై కూడా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. అయితే నేడు జరగబోయే సమావేశానికి ఇటీవల కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురు నేతలు కూడా రానున్నారు.








