మహా: బీసీల విషయంలో కాంగ్రెస్ నయవంచన చేసిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల మాటలు బూటకమని అన్నారు. ఇదే విషయాన్ని తాము మొదట్నుంచి చెబుతున్నామని తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్ ఇక చెత్తబుట్టలో పారేయాల్సిందేనని వ్యాఖ్యానించారు.హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. కులగణన ఏదో గొప్పగా చేశామని ఇది దేశానికి రోల్ మోడల్ అని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల్లో చెప్పిందేమిటి ?చేసిందేమిటి అని ఆయన ప్రశ్నించారు. కులగణన తప్పుల తడకగా చేశారని .. అరవై శాతం జనాభా ఉన్న బీసీలకు మూడేనా మంత్రి పదవులు అని నిలదీశారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మంత్రివర్గ కూర్పులో ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు.
చట్టబద్దత ఏదీ ?..
బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్దత ఏదీ ? కీలక శాఖలు బీసీల దగ్గర ఎందుకు లేవు? ఏడాదికి రూ.20వేల కోట్లు బీసీలకు బడ్జెట్ లో పెడతామని చెప్పి ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఏ మొహం పెట్టుకుని స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందని మండిపడ్డారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడం ఏమిటి ? 42 శాతం సీట్లు బీసీలు ఎలాగైనా గెలుస్తారు.. మీరు ఇచ్చేది ఏమిటి అని నిలదీశారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో కులవృత్తుల బతుకులు ఆగమయ్యాయని అన్నారు. బీసీలు అప్రమత్తంగా లేకపోతే కాంగ్రెస్ ఆగడాలకు అంతే ఉండదని పేర్కొన్నారు. దీనిపై బీసీ సంఘాలు కూడా స్పందించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు . కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తే బీసీలు కాంగ్రెస్‌కు రెడ్ కార్పెట్ పరుస్తారని చెప్పారు.








