హైదరాబాద్, మహా: హీరో మహేష్‌బాబును మాజీ మంత్రి కేటీఆర్ కాపీ కొడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు గుప్పించారు. ఫార్ములా వన్ రేసు కేసులో అరవింద్ కుమార్ కీలకమైన వ్యక్తి అని తెలిపారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఎక్కడున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి ఉందని అన్నారు. అరవింద్ కొన్ని రోజులుగా కనపడటం లేదని చెప్పారు. అసలాయన అరవింద్ లేడు కాబట్టి ఏం కాదని కేటీఆర్ అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. వీళ్ల అవసరాల కోసం, తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఏమైనా చేస్తారని ఆరోపించారు. గతంలో కేటీఆర్ మిత్రుడు కేదార్నాథ్ దుబాయ్‌లో చనిపోయారని గుర్తుచేశారు. కేటీఆర్ ప్లాన్‌తోనే ప్రభాకర్‌రావు అమెరికా వెళ్లి దాక్కున్నారని ఆరోపణలు చేశారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు.
కవిత జైలుకి వెళ్లింది ఢిల్లీలో..
సినీ భరత్ అనే నేను సినిమాలో మహేష్‌బాబు లాగా కేటీఆర్ ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్వీ సినిమా డైలాగులేనని దెప్పిపొడిచారు. జైలుకెళ్తే సీఎం అవుతారనే ట్రెండ్‌ని కేటీఆర్ బలంగా నమ్ముతున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత జైలుకి వెళ్లింది ఢిల్లీలో, తాను హైదరాబాద్‌లో జైలుకెళ్తే తానే సీఎం అవుతానని కేటీఆర్ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఉద్యమకారుడు కాదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు కాబట్టే విచారణ జరుగుతోందని అన్నారు. కేటీఆర్ అరెస్ట్ కావాలనే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారని చెప్పారు. కుట్రలు, కుతంత్రాలకు కేసీఆర్ కుటుంబం నిలయమని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.








