వరంగల్ మహా;
వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని వరంగల్ సబ్ డివిజన్ పోలీస్ అధికారుల తీరు పై గత కొంతకాలంగా సర్వత్ర విమర్శలున్నాయి.
ఎలాంటి రాజ్యాంగ పదవి లేని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు కు వరంగల్ ఏసీపీ తోపాటు పోలీస్ అధికారులు ప్రోటోకాల్ ను విస్మరిస్తూ, పర్సనల్ సెక్యూరిటీ గా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే కొండా మురళికి ఎస్కార్ట్ కల్పించిన పోలీసు అధికారుల పై వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సీరియస్ గా స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా కొండా మురళికి ఎస్కార్ట్ కల్పించిన వరంగల్ ఏసీపీ, సీఐ తో పాటు మరో ఇద్దరు అధికారులకు సీపీ సన్ ప్రీత్ సింగ్ మెమోలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లుగా పలు మీడియా, పత్రికల్లో వచ్చిన కథనాలను కూడా జారీ చేసిన మెమోల్లో సీపీ పేర్కొన్నారు. మీ పై చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలుపలంటూ సీపీ మెమోలో అధికారులను వివరణ కోరారు. ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితం పోలీసు అధికారులు కొండా మురళికి ఎస్కార్ట్ తీసుకెళ్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ఈ విషయం ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లడం, ప్రతిపక్షాలు, సామాన్య జనాలు, ముఖ్యంగా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో దీనిపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే సీపీ వరంగల్ డివిజన్ పోలీస్ అధికారులకు మెమోలు జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో కూడా వరంగల్ ఏసిపి నందిరాం నాయక్ కు మెమో జారీ అయినట్టు సమాచారం. మెమోలు జారీ చేయడంతో పాటు వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది.








