వరంగల్ మహా;
ఇటీవల రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారం పై జిల్లా నేతల తో పాటు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఇచ్చిన ఫిర్యాదు పై శనివారం గాంధీ భవన లో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సమావేశమైంది. అయితే కమిటీ ఎదుట హాజరైన కొండా మురళి ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తారని.. పార్టీ ఆయన పై చర్యలు తీసుకుంటుందని అనుమానిస్తున్న క్రమంలో అనూహ్యంగా కొండా మురళి రివర్స్ కౌంటర్ కు దిగారు. తన పై విమర్శలు గుప్పిస్తున్న వరంగల్ కీలక నేతల పైనే కమిటీకి 15 పేజీలతో కూడిన నివేదిక అందించినట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి , హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పై కొండా మురళి క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. మొత్తం 15 పేజీలతో కొండా మురళి నివేదిక అందజేశారు.
కొండా నివేదిక ప్రకారం…
స్టేషన్ ఘన్ పూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం శ్రీహరి పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రేవూరి ప్రకాశ్ రెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తున్నారని, అక్రమ క్రషర్ ను ప్రోత్సహిస్తున్నాడని నివేదికలో పేర్కొన్నారు. ఇక వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా తన నియోజకవర్గంలో పోస్టులు ఇప్పించుకుంటున్నారని ఆరోపించారు.
ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని ఆయన క్రమశిక్షణ కమిటీ సభ్యులను కోరారు. కమిటీ ఈ నివేదికను స్వీకరించి విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
క్రమశిక్షణ కమిటీ తో ఏమన్నారు?
పార్టీ క్రమశిక్షణా కమిటీ ముందు కొండా మురళి మాట్లాడుతూ నన్నెవరూ పిలవలేదు పార్టీపై గౌరవంతోనే నేనే వచ్చానని నా వ్యక్తిత్వాన్ని సేవలను నిరాకరించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. భూపాలపల్లి నుంచి నేనే పోటీ చేయాలని అనుకున్నాను. వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ పోటీ చేసింది కాబట్టి నేను తప్పకున్నా. మరో పార్టీ నుంచి గండ్ర వొచ్చినా ఆయన మద్దతు ఇచ్చి ప్రచారం చేశాను. ఇప్పుడు ఆయనే ఇతరులతో కలిసి నాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు.
మరోవైపు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి సీటు రాకపోవడానికి నేనే కారణమని నా పై కోపంగా ఉన్నట్టున్నారు. నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పుడు రాజీనామా చేసే వచ్చాను. అలాగే తన తో పాటు 26 మంది కార్పొరేటర్లను తీసుకోవచ్చానని పేర్కొన్నారు. కొందరి మాదిరిగా పార్టీ మారి పదవిని ఎంజాయ్ చేయడం లేదన్నారు. ఇండియాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీని నేనొక్కడినే అని కమిటీకి ఇచ్చిన నివేదికలో కొండా మురళి పేర్కొన్నారు.
పొంగులేటి పై కొండా ఆరోపణలు
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై కూడా కొండా మురళి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పొంగులేటి, తమపై కక్షతో రాజకీయ కుట్రలు పన్నుతూ, వరంగల్ జిల్లాలోని మాకు వ్యతిరేకమైన నాయకులను పోగేస్తున్నారని అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉండడంతో ఈ ఆరోపణలకు ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న స్థానిక ఎన్నికల సన్నాహాల సమయంలో ఈ ఆరోపణలు పార్టీలో మరింత దుమారాన్ని రేపనున్నాయి.








