ఆదిలాబాద్, మహా
షెడ్యూల్ ప్రాంత హక్కులను కాలరాస్తూ ఆదివాసీలను అడవికి దూరం చేసే విధంగా ఉన్న జీఓ. 49ను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం(టీఏజీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్శిషా కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 మే 30న తాడోబా, అందేరి రిజర్వ్ ఫారెస్ట్ తో కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ కలుపుతూ ఈ 49 జీఓ తీసుకొచ్చిందని తెలిపారు. కుంరం భీం జిల్లాలోని కాగజ్ నగర్, ఆసిఫాబాద్ పరిధిలో 334 గ్రామాలను గెజిట్ లో పేర్కొంటూ తీసుకొచ్చిన ఈ జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతం రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉందని ఇక్కడ గ్రామ సభ, పెసా లాంటి గిరిజన చట్టాలను అమలు పర్చకుండా ఎలాంటి సభలు నిర్వహించకుండా, ప్రజాభిప్రాయం కూడా తీసుకోలేదని తెలిపారు. ఇక్కడ ఈ రిజర్వ్ ఫారెస్ట్ చేపడుతున్న సందర్భంగా ప్రభుత్వం నుండి మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు, త్రీ ఫేజ్ కరెంట్, ఇతర సదుపాయాలు అన్ని ఫారెస్ట్ అధికారులు ఆపేశారని గుర్తు చేశారు. ఈ జీఓ ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఉన్నందున తక్షణం రద్దు చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆత్రం కిష్టన్న, నాయకులు కొట్నాక్ సక్కు, సిడాం మాధవ్, మరప కిష్టు, దడంజ దాసు, స్వామి, పోచక్క, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.








