రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
చర్లగూడ గ్రామ బ్రిడ్జి అసంపూర్తిగా ఉండడంతో గ్రామ ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చొక్కంపేట ఆంజనేయులు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చర్లగూడ గ్రామ పరిధిలో, మూడు సంవత్సరాల క్రితం చెర్లగూడ వంతెన, షాబాద్ మెయిన్ రోడ్డు నుండి అస్పల్లిగూడ రోడ్డు, చెర్లగూడ నుండి చెరువు కట్ట వరకు రోడ్డు పనులకు మొత్తానికి కలిపి 9 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. వంతెన, వివిధ రోడ్ల నిర్మాణాలను కలిపి శంకుస్థాపన చేసి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్న, అప్పటి నుండి ఇప్పటి వరకు 30 % పనులు పూర్తి కాకపోవడంలో జాప్యం ఏమిటో అర్ధం కావడం లేదని ఆంజనేయులు అన్నారు. నిధులు పెద్ద మొత్తంలో మంజూరు అయిన్నప్పటికి బ్రిడ్జి మరియు రోడ్ల పనులు ముందుకు సాగడం లేదని, బ్రిడ్జి పనులలో అధికారుల నిర్లక్ష్యం ఉందా, లేకపోతే రాజకీయాల ప్రభావమా అనేది అర్ధం కాకుండా ఉన్నదని అన్నారు. వంతెన పనులకు మూడు సంవత్సరాల క్రితం 9 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయినప్పటికీ ఇంత కాలయాపన జరుగడానికి కారణాలు ఏమిటనేది గ్రామస్తులకు అంతు చిక్కడం లేదని అన్నారు. అంతే కాకుండా వర్షాలు కురుస్తున్న సమయంలో గ్రామ ప్రజలకు విద్యార్థులకు, రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సంబందించిన అధికారులు స్పందించి చెర్లగూడ వంతెన మరియు రోడ్లకు సంబందించిన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, లేనిపక్షంలో ఉన్నతాధికారుల ద్రుష్టికి తీసుకువెళ్లడమే కాకుండా గ్రామ ప్రజలందరిని చైతన్యం చేసి బ్రిడ్జి, రోడ్లను పూర్తి చేసేవరకు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం చేస్తామని ఆంజనేయులు తెలియజేయడం జరుగుతుంది.







