రామాలయం భూమిలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోబోయిన అధికారులను ఆక్రమణ దారులు అడ్డుకోవడమే కాకుండా… ఆంధ్రలో అడుగుపెడితే అంతు చూస్తామని బెదిరించారని ఆలయ అధికారులు వాపోయారు. ఈ మేరకు సోమవారం రామాలయం అధికారులు ఒక వీడియో విడుదల చేశారు. తెలంగాణా ఏర్పడినప్పుడు రాష్ట్ర విభజనలో భాగంగా భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం తెలంగాణాలో, రామాలయం భూములు ఆంధ్రలో ఉండిపోయాయు. భద్రాచలం శివారు, ఆంధ్ర రాష్ట్రం పురుషోత్తమపట్నంలో రామాలాయానికి చెందిన భూమి 889.50 ఎకరాలు వుంది. తెలంగాణా ఏర్పడక ముందు ఈ భూములు సాగు చేస్తున్న రైతులు ప్రతి సంవత్సరం కౌలు చెల్లించేవారు. తెలంగాణా ఏర్పడిన తర్వాత, ఆంధ్ర లోని కొందరు ప్రజా ప్రతినిధులు అండ చూసుకుని కౌలు చెల్లించడంలేదు సరికదా… ఆ భూములు మావే అంటూ తిరగపడుతున్నారు. గతంలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోబోయిన అధికారులపై దాడులు చేసి భయ బ్రాంతులకు గురి చేశారు. ఈ భూమి విషయంలో ఆంధ్ర, తెలంగాణా హైకోర్టు లు రామాలయానికి అనుకూలంగా తీర్పు ఇచ్చాయి. ఇప్పటికి రామాలయం పేరుతోనే పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి. కాని ఆంధ్రకు చెందిన రెవిన్యూ, పోలీస్ అధికారులు సహకరించడంలేదని, సోమవారం ఆలయ భూమిలో అక్రమ నిర్మాణం చేపడుతున్నారని సమాచారం అందడంతో అక్కడకు వెళ్లిన తమను ఆంధ్రకు వస్తే అంతు చూస్తామని ఆక్రమణకు పాల్పడిన వారు బెడఁదిరించారని అక్కడే ఉన్న ఆంధ్ర పోలీసులు, రెవిన్యూ అధికారులు వారిని అడ్డుకోలేదని ఏ ఈ ఓ భవాని రామకృష్ణ, ఈ ఈ రవీందర్, సూపెరనెంట్ కత్తి శ్రీను తెలిపారు.








