• ఫూలే దంపతుల ఆశయాలతో విద్యా వ్యవస్థ ప్రక్షాళన.
• బీసీ జనగణన, ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయానికి బాటలు.
• సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మహా.
చదువు ఒక్కటే మనిషికి ఆత్మగౌరవాన్ని, సామాజిక గుర్తింపును, తలెత్తుకుని జీవించే అవకాశాన్ని కల్పిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే దంపతుల స్ఫూర్తితో విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని పేర్కొన్నారు. కుల నిర్మూలన, సామాజిక చైతన్యం రావాలంటే అందరూ కలిసి చదువుకోవడం, కలిసి జీవించడం అవసరమని చెప్పారు. ఫూలే దంపతుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.
దేశంలో ఎక్కడికి వెళ్లినా డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ వంటి మహనీయుల విగ్రహాలు కనిపిస్తాయని రేవంత్‌రెడ్డి అన్నారు. నెక్లెస్ రోడ్ చౌరస్తాలో ఒకవైపు అంబేద్కర్, మరోవైపు ఇందిరాగాంధీ, మరోవైపు పీవీ నరసింహారావు, మరోవైపు మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం గర్వకారణమన్నారు. రాజ్యాంగాన్ని, ఓటు హక్కును అందించిన అంబేద్కర్ విగ్రహం కూడా అక్కడే ఉండటం ప్రత్యేకత అని చెప్పారు.
సుమారు 150 ఏళ్ల క్రితమే జ్యోతిబా ఫూలే చదువు ఒక్కటే అభివృద్ధికి మార్గమని గుర్తించారని సీఎం పేర్కొన్నారు. తాను చదువుకోవడమే కాకుండా తన భార్య సావిత్రీబాయి ఫూలేను చదివించి ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు. దాదాపు శతాబ్దన్నర క్రితం మరణించినప్పటికీ నేటి తరానికి కూడా ఫూలే ఆదర్శంగా నిలుస్తున్నారంటే ఆయన ఆలోచనల గొప్పతనం అర్థమవుతుందని అన్నారు.
తమ ప్రభుత్వం ఫూలే ఆలోచనలను కొనసాగిస్తోందని రేవంత్‌రెడ్డి చెప్పారు. విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని, నర్సరీ స్థాయి నుంచే విద్యార్థులకు విద్యతోపాటు అవసరమైన సదుపాయాలు, పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలోనూ విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో సుమారు రూ.2,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ముందుగానే అందించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలను విద్యార్థుల ఖాతాల్లోకి పారదర్శకంగా జమ చేస్తామని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నిర్ణీత ప్రక్రియ పూర్తయిన తర్వాత త్వరగా రీయింబర్స్‌మెంట్ అందేలా వ్యవస్థను రూపొందిస్తున్నామని తెలిపారు.
ఫీజులు చెల్లించలేదన్న కారణంతో విద్యార్థులకు కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండకూడదని రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థి ఇంజనీర్‌గానో, డాక్టర్‌గానో మారాలంటే కేవలం సర్టిఫికెట్ సరిపోదని, ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు కూడా ఉండాలని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యతోపాటు స్కిల్ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతోందని సీఎం అన్నారు. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో నర్సింగ్ సహా వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన వారికి పెద్దఎత్తున అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ఐటీ రంగంలో కూడా మార్పుల కారణంగా నిపుణులు ఉద్యోగాలు కోల్పోయి తిరిగి వస్తున్న పరిస్థితి ఉందని చెప్పారు. అందువల్ల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యతోపాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
2024లో టాటా సంస్థ సహకారంతో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేశామని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆయా కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నెలకు రూ.2,000 స్టైపెండ్ అందిస్తున్నామని చెప్పారు. విద్యతోపాటు సాంకేతిక నైపుణ్యాలను అందించడమే లక్ష్యమన్నారు. కేవలం సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం వచ్చే రోజులు పోయాయని, నైపుణ్యమే ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే కీలక ఆయుధమని పేర్కొన్నారు.
పోటీ పరీక్షల్లోనూ విద్యార్థుల మధ్య పోటీ తీవ్రంగా పెరిగిందని సీఎం అన్నారు. గ్రూప్-1 నియామకాల్లో బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు గణనీయంగా ఎంపికయ్యారని చెప్పారు. ప్రస్తుతం వందకు వంద మార్కులు సాధించే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోందని, పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే విద్యతోపాటు నైపుణ్యాలు అవసరమని తెలిపారు.
క్రీడలకు కూడా తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రేవంత్‌రెడ్డి చెప్పారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. క్రీడల్లో ప్రతిభ చూపి పతకాలు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే బాధ్యత తనదేనని చెప్పారు. సిరాజ్, నిక్కజ్, దీప్తి వంటి క్రీడాకారులకు ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఎంత బాధ్యతగా ఆలోచిస్తారో.. తాను కూడా రాష్ట్ర యువత భవిష్యత్తు గురించి అంతే బాధ్యతగా ఆలోచిస్తానన్నారు.
సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని సీఎం తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు దశాబ్దాలుగా పోరాడారని, తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేసి సమస్య పరిష్కారానికి ముందడుగు వేసిందని చెప్పారు. బీసీ జనగణన విషయంలోనూ తమ ప్రభుత్వం ధైర్యంగా నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
దేశంలో బీసీ జనాభాకు సంబంధించిన కచ్చితమైన లెక్కలు లేకపోవడం వల్ల బలహీన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో ఇబ్బందులు ఉన్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు. బలహీన వర్గాలకు ఉద్యోగాలు, అవకాశాలు కల్పించాలంటే వారి జనాభా ఎంతన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే కులగణన చేపట్టామని తెలిపారు. కులగణనకు కొందరు మాజీ ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు సహకరించలేదని, వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయని ఆరోపించారు. అయినప్పటికీ ప్రక్రియను పూర్తి చేశామని చెప్పారు.
గత ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీసీ యువతకు చదువు, ఉన్నత ఉద్యోగాలు, అధికారంలో భాగస్వామ్యం కల్పించడానికి బదులుగా బర్రెలు, గొర్రెలు పెంచుకోవాలని, చెప్పులు కుట్టుకోవాలని, చేపలు పట్టుకోవాలని మాత్రమే సూచించారని విమర్శించారు. ఒక వర్గం పిల్లలు రాజ్యాలు ఏలాలని, బీసీలు రాజ్యాధికారంలో భాగం అడగకూడదనే ఆలోచనతోనే ఇలాంటి విధానాలు అమలు చేశారని ఆరోపించారు.
‘‘ఇప్పుడు కూడా చెప్పులు కుట్టుకోవాల్సిందేనా? గొర్రెలు, బర్రెలు కాసుకోవాల్సిందేనా? బీసీ సమాజం చదువుకోకూడదా? ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలు కాకూడదా?’’ అని సీఎం ప్రశ్నించారు. చదువు ఒక్కటే తలరాతలను మార్చగలదని, తెలంగాణను మార్చే శక్తి కూడా విద్యకే ఉందని అన్నారు. తెలంగాణను ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు విద్యే ప్రధాన మార్గమని స్పష్టం చేశారు.
జ్యోతిబా ఫూలే స్ఫూర్తిని తీసుకుని విద్యార్థులు భవిష్యత్తులో చట్టసభల్లోకి రావాలని, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదగాలని రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. నాణ్యమైన విద్యను అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం తాను రోజుకు 18 గంటలు పనిచేస్తానని చెప్పారు.
విద్యార్థులకు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. చదువుకుంటేనే అవకాశాలు వస్తాయని, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సామాజిక చైతన్యంతో ప్రభుత్వం మరిన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. యువత, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు ప్రజల సహకారం అవసరమని పేర్కొంటూ, ప్రస్తుత ప్రభుత్వాన్ని కొనసాగించాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను కోరారు.








