Mahaa Daily Exclusive

  ఎడతెరిపి లేని వర్షం.. -ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు..నిండుకున్న చెరువులు – పలు సాగునీటి ప్రాజెక్టులకు జలకళ..!

Share

ఆదిలాబాద్, మహా

ఆదిలాబాద్ జిల్లాలో మొన్నటి వరకు వర్షం లోటు వర్షపాతం నమోదు కాగా.. తాజాగా వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో సాధారణ స్థాయికి చేరుకుంది. రోజూ వర్షం రావడం మూలంగా జనజీవనానికి అవాంతరాలు ఎదురవుతున్నాయి.
ఈ సీజన్లో జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 281.1 మి.మి వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 309 మి.మి వర్షం కురిసింది. సాధారణం కంటే కొంత అధికంగానే వర్షం కురవడం గమనార్హం. రోజూ ఏదో ఒక సమయంలో వర్షం రావడంతో వ్యవసాయ పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పొలాలు బురదమయంగా ఉండటం..కొన్ని చోట్ల చేన్లలోకి నీళ్లురావడంతో పొలం పనులు సాగడం లేదు. మరోపక్క కొద్దిపాటి విరామం తప్పితే ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో చిరు వ్యాపారులు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు ఇబ్బందులకు గురవుతున్నారు.

ప్రాజెక్టులకు జలకళ..

జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలతో పాటు ఎగువన మహారాష్ట్ర ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దున ఉన్న పెన్ గంగా నది ఉదృతంగా ప్రవహస్తోంది. సాత్నాల, మత్తడివాగు, స్వర్ణ, కడెం తదితర సాగు నీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. జిల్లాలో కురుస్తున్న వర్షానికి తోడు ఎగువ నుంచి వరద నీరు వస్తుండటంతో అధికారులు ఆయా ప్రాజెక్టుల గేట్లు కొన్నింటిని ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. జిల్లాలోని కుంటాల, పొచ్చెర, కనకాయి, గాయత్రి వంటి జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. చూపరులను కనువిందు చేస్తున్నాయి.

వ్యవసాయ పనులకు ఆటంకం

జిల్లాలో కురుస్తున్న వర్షంతో ప్రాజెక్టులు, చెరువులు నిండుతున్నా వ్యవసాయ పనులకు మాత్రం ఆటంకం కలుగుతోంది. గత వారం రోజుల నుంచి రోజూ మధ్యాహ్నం నుంచి వర్షం ప్రారంభం కావడంతో పొలం పనులు సాగడం లేదు. ఫలితంగా ఎరువులు వేయలేని పరిస్థితితో పాటు అరక కూడా సాగడం లేదు. దీంతో పత్తి, సోయా తదితర పంటల్లో కలుపు మొక్కలు పెరగడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల పంట పొలాల్లో వర్షపునీరు నిల్వడంతో రైతులు వాటిని బయటకు పంపించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. మరోపక్క రోజువారీగా వర్షం కురుస్తుండటం కారణంగా రోడ్లపక్కన వ్యాపారులు చేసుకొని జీవించే అనేక మంది చిరు వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణ వాసులు సైతం బయటకు వెళ్లేలేని పరిస్థితి ఉండటంతో వ్యాపారానికి నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారు సైతం వర్షం కారణంగా ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. మరో రెండు రోజుల పాటు ఇదే మాదిరి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Latest