మంచిర్యాల, మహా : మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, నర్వ గ్రామ సమీపలో గ్రేస్ పాఠశాలకు చెందిన టాటా మ్యాజిక్ వాహనం బోల్తా పడి పలువురు విద్యార్థులు గాయాల పాలైన ఘటన శుక్రవారం ఉదయం మంచిర్యాల జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే… జైపూర్ మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 24 మంది విద్యార్థులు శుక్రవారం టాటా మ్యాజిక్ వాహనంలో శ్రీరాంపూర్ లోని గ్రేస్
పాఠశాలకు విద్యభ్యాసం కొరకు వెళుతున్నట్లు సమాచారం. టాటా మ్యాజిక్ డ్రైవర్ కు ఫోన్ రావడంతో తాను డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఈ అజాగ్రత్తలు వల్లనే నార్వ గ్రామ బస్ స్టాప్ వద్ద అదుపుతప్పి వాహనం బోల్తా పడిందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోధిస్తూ తెలిపారు. ఈ ఘటనలో 8 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పడంతో ఒక్కసారిగా ప్రభుత్వ అధికారులు, పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదాల పాలైన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బాధ్యత వహించాలి
గ్రేస్ ప్రవేట్ పాఠశాలకు టాటా మ్యాజిక్ వాహనంలో వెళుతుండగా జరిగిన ప్రమాదం లో గాయాల పాలైన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బాధ్యత వహించాలని పి డి ఎస్ యు విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. పరిమితి మించి విద్యార్థులను తరలిస్తున్న సదరు పాఠశాల యాజమాన్యం పై ఆర్టీవో అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ ప్రమాదంలో గాయాలపాలైన విద్యార్థుల వైద్య ఖర్చులు పాఠశాల యాజమాన్యమే భరించాలని వారు కోరారు.
ఫిట్నెస్ లేని వాహనాలు… లైసెన్సులు లేని డ్రైవర్లతోనే ఇబ్బందులు
ఫిట్నెస్ లేని వాహనాలను… లైసెన్సులు లేని డ్రైవర్లను జిల్లాలో ప్రవేట్ పాఠశాలల యాజమాన్యాలు పనిలో పెట్టుకుంటున్నాయని వారి వల్లనే తరచూ ఇబ్బందులు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
వాహన రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల ప్రాథమిక సూత్రాలను డ్రైవర్లు అనుసరించకపోవడంతో తరచుగా సమస్యలు వస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
జిల్లా ఆసుపత్రికి తరలివచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు
పాఠశాలకు వెళ్లవలసిన టాటా మ్యాజిక్ వాహనం ప్రమాదానికి గురైందని వార్తా కథనాలు సామాజిక మాధ్యమంలో వెలవడంతో మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి విద్యార్థుల తల్లిదండ్రులు తరలివచ్చారు. గాయాల పాలైన చిన్నారులను చూసి ఒక్కసారిగా రోదనలు చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతున్నాడని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ తననే డ్రైవర్ గా పంపించడంతో ప్రమాదం జరిగిందని వారు వాపోయారు.
చూసి చూడనట్లుగా ఆర్.టి.వో, విద్యాశాఖ అధికారులు
మంచిర్యాల జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల వాహనాలు ఫిట్నెస్, డ్రైవర్ల లైసెన్స్, ఇన్సూరెన్స్, బ్యాడ్జి తదితరులను రోడ్డు రవాణా శాఖ, విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతోనే జరగరాని ప్రమాదం జరిగిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకనైనా వివిధ పాఠశాలలో వాహనాలు నడుపుతున్న సదరు డ్రైవర్ల ధ్రువపత్రం పరిశీలించి విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.








