Mahaa Daily Exclusive

  డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలి కలెక్టరేట్ ఎదుట అధ్యాపకుల ధర్నా..!

Share

ఆదిలాబాద్, మహా

డిగ్రీ కళాశాలలు ప్రారంభమై 40 రోజులైనా డిగ్రీ గెస్ట్ లెక్చరర్ లను రెన్యువల్ చేయకుండా కాలయాపన చేయడంతో అధ్యాపకులు, విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోందని డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సోగల ప్రవీణ్ తెలిపారు. సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జూన్ 2న డిగ్రీ కళాశాలలను తెరిచినప్పటికీ అధ్యాపకుల రెన్యూవల్ ను మాత్రం మరిచిపోయారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 8 యూనివర్సిటీల పరిధిలోని 149 డిగ్రీ కళాశాలలో 1940 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారని చెప్పారు. వీరి సేవలతోనే 90శాతం కళాశాలలు నడుస్తున్నాయని వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పాఠాలు బోధించే డిగ్రీ గెస్టు లెక్చరర్స్ లేక విద్యార్థులు పాఠాలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సందేహాలు తీర్చేవారు లేక అయోమయానికి గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకొని గత సంవత్సరంలో పనిచేసిన డిగ్రీ గెస్టు లెక్చరర్ లను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. త్రీ మెన్ కమిటీతో డెమో తీసుకునే విధానాన్ని రద్దు చేయాలని,గంటల పని విధానాన్ని తొలగించాలని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన యూజీసీ నిబంధనల ప్రకారం ప్రతినెల రూ.50వేల కన్సాలిడేటెడ్ పే తో ఏడు నెలలకు కాకుండా 12 నెలలకు వేతనం చెల్లిందాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాహుల్, ఉపాధ్యక్షులు సుభాష్, కోశాధికారి ఆనంద్,నారాయణ జావిద్ ,ప్రవీణ్ కుమార్ వివిధ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Latest