మంచిర్యాల, మహా : మంచిర్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డి.ఈ.ఈ.టి) ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు శ్రీనివాసరావు, హరికృష్ణ, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాన్ రెడ్డి, షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి సిహెచ్ దుర్గాప్రసాద్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి లతో కలిసి డి.ఈ.ఈ.టి. సంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డి.ఈ.ఈ.టి. ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం జరుగుతుందని తెలిపారు. డి.ఈ.ఈ.టి. యాప్ లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలు ప్రతి రోజు నవీకరించబడతాయని, ఈ వేదిక ద్వారా అభ్యర్థులు తమ విద్యార్హత, అనుభవం ఆధారంగా తగిన ఉద్యోగాల కోసం శోధించవచ్చని, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూలు, ఉద్యోగ మేళాలు, రెస్యూమ్ తయారీ, కెరీర్ మార్గదర్శకత వంటి సదుపాయాలు పొందుపర్చడం జరిగిందని తెలిపారు. నిరుద్యోగ యువత యాప్ ను వినియోగించుకొని ఉపాధి పొందాలని, అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.








