ఖమ్మం, మహా.
పి.హెచ్.సీల పనితీరు ఇకపై ‘పూర్తిస్థాయిలో’ ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. బి. కళావతి బాయి అధికారులకు తేల్చిచెప్పారు. ఖమ్మం డివిజన్‌కు చెందిన పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఈ సమావేశాన్ని డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ డా. చందు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి ఆరోగ్య కార్యక్రమాల సమీక్ష జరిగింది. ప్రభుత్వ లక్ష్యాల మేరకు జిల్లా పి.హెచ్.సీల పనితీరును పరిశీలించిన డా. కళావతి బాయి, కొన్ని కేంద్రాలు మినహా మిగిలినవి ప్రస్తుతానికి నిరుత్సాహకర స్థాయిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
“ఇకపై ఊరుకోలేం. ప్రతి పి.హెచ్.సీ, యూ.పి.హెచ్.సీ, ఏఎన్‌సీ, ఇమ్యూనైజేషన్, ప్రభుత్వ ప్రసవాల లక్ష్యాల్లో 100 శాతం ప్రదర్శన అవసరం. ఒకరి నిర్లక్ష్యంతో మొత్తం జిల్లా స్థాయి క్షీణిస్తుంది. ఇది ఆమోదయోగ్యం కాదు. అన్ని రిపోర్టులు ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా పూర్తి చేసి పంపించాలి. వారం రోజుల్లో మళ్లీ సమీక్ష ఉంటుంది. అప్పుడు పనితీరు ఆధారంగా నివేదిక సిద్ధం చేసి రాష్ట్రానికి పంపించాల్సి ఉంటుంది,” అని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా, జిల్లా ఆసక్తికరమైన మానవీయ సంఘటనకు వేదికైంది ఈ సమావేశం. విధుల్లో ఉన్నప్పుడే ఆకస్మికంగా మృతి చెందిన ఆశ కార్యకర్త మోడుగు సులోచన (తల్లాడ ఎంపీహెచ్‌సీ) మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ వరప్రసాద్ (బస్వాపురం) కుటుంబాలకు ఆర్థిక సహాయంగా తలంచి, తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడు డా. రానా శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి డా. రమేష్, కోశాధికారి డా. రత్న మనోహర్ సమన్వయంతో ఒక్కొక్కరికి రూ.5000 చొప్పున అందజేశారు. ఈ సాయాన్ని జిల్లా వైద్యాధికారి చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు అందించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డా. చందు నాయక్, ప్రోగ్రాం ఆఫీసర్ డా. రామారావు, డెమో సుబ్రహ్మణ్యం, స్థాటిస్టికల్ ఆఫీసర్ నవీన్, ఎన్.హెచ్.ఎం. డి.పి.ఓ. దుర్గ, నాగరాజు, రవితేజ, కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం చివర్లో జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లందరికీ అవసరమైన మార్గదర్శకాలు, సూచనలు అందజేయడమైంది.








