కూసుమంచి, జులై 16, మహా:
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. బుధవారం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మద్దులపల్లి మార్కెట్ కమిటీ అధ్యక్షుడు బైరు హరినాధ్ బాబు, మాజీ జడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్, కార్యాలయ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపిపి కొప్పుల అశోక్ తీవ్రంగా ఖండించారు. జగదీష్ రెడ్డి తక్షణమే మంత్రికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పొంగులేటి అంటేనే ప్రజల మనిషి అని, మచ్చలేని నాయకుడు అని గుర్తు చేశారు. పదేండ్లు అధికారంలో ఉండి పేదలకు కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వని బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుంటే అవాకులు, చెవాకులు పేలుతున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్లు లేని పేదలకు ఐదు లక్షల రూపాయలతో పేదోడి కల నెరవేరుస్తున్న మంత్రి పొంగులేటి ని విమర్శించడం సిగ్గు చేటు అన్నారు. ధరణి పేరుతో లక్షల ఎకరాలను దోచుకున్న బీఆర్ఎస్ దొంగలు భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ రైతులు, ఆసాములకు మన్ననలు పొందుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. మంత్రిపై మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నేడు కూసుమంచి లో జరగబోయే ఇందిర మహిళ శక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, నాయకులు అరవింద్ రెడ్డి, బజ్జూరి వెంకటరెడ్డి, మామిడి వెంకన్న,బండి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.








