ఆదిలాబాద్, మహా:
జల్సాలకు అలవాటు పడి మెకానిక్ వృత్తిని అడ్డుగా ఉంచుకొని దొంగతనాలు చేస్తున్న ముఠాను జైనథ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.గురువారం జిల్లా ఎస్పీ జైనథ్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన అయన వివరాలను వెల్లడించారు.బేల మండలానికి చెందిన మెకానిక్ సుమిత్,వారి మిత్రులు మైనర్ సలీం, షకిల్ తో కలిసి మహారాష్ట్రకు చెందిన కృష్ణతో గ్యాంగ్ గా ఏర్పడి ఆదిలాబాద్ వన్ టౌన్ బేల, జైనథ్ మండలాల్లో దొంగతనాలు చేస్తూ, వాహనాలకు ఇంజన్లు మారుస్తూ ఇతరులకు అమ్ముతూ నేరాలకు పాల్పడటం జరిగిందన్నారు. నిందితులందరినీ జైనథ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందని వివరించారు. నిందితుల వద్ద నుండి వాహనాలను కొనుగోలు చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. మొత్తం 12 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఫిర్యాదుదారు మద్దులవార్ రమేష్ జైనథ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా తాను శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయం వద్ద పార్క్ చేసిన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని తెలిపారు. ఫిర్యాదు అందుకున్న జైనథ్ ఎస్సై గురువారం ఉదయం 4 గంటల సమయంలో సిబ్బందితో కలిసి జైనథ్ మండల పరిధిలో రాత్రి గస్తీ నిర్వహిస్తున్న సమయంలో దీపాయిగూడ -చౌరస్తా వద్ద ముగ్గురు వ్యక్తులు బైక్ పై అనుమానాస్పదంగా ప్రయాణిస్తూ కనిపించారు. పోలీసులు వారిని ఆపేందుకు ప్రయత్నించగా, వారు పారిపోవడానికి ప్రయత్నించగా వెంటనే వారిని పట్టుకున్నారన్నారు. వారిని విచారించగా సుమిత్ సకర్కర్,దహేగావ్ గ్రామానికి చెందిన ఓ మైనర్ షకీల్ తో స్నేహం పెంచుకున్నాడన్నారు. వీరితోపాటు సలీం అనే వ్యక్తితో కలిసి దొంగతనాలను చేయడం ప్రారంభించారన్నారు. అనంతరం వీరందరూ కలిసి మోటార్ సైకిల్లు చోరీ చేసి అవి అమ్మేలా ఒక పథకం రచించారు.తన స్నేహితుడు మహారాష్ట్రకు చెందిన నఖతే కృష్ణ అనే మరో వ్యక్తిని కలిసి ఈ పథకం వివరించి అతడిని కూడా చోరీలకు భాగస్వామిగా చేసుకున్నాడన్నారు. వారు మహారాష్ట్రలోని దుర్గడి గ్రామానికి వెళ్లి అక్కడి నుంచి వివిధ ప్రాంతాల్లో మోటార్ సైకిళ్లు దొంగిలించేవారన్నారు. దొంగిలించిన వాహనాలను స్క్రాప్ వ్యాపారులకు అమ్మేవారని తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ కు పంపారని, ఒక మైనర్ ను జువెనైల్ హోమ్ కు తరలించారని తెలిపారు.ఈ కేసులో ప్రతిభ కనబరిచిన జైనథ్ సీఐ డి.సాయినాథ్, ఎస్సై గౌతమ్, సిబ్బంది వికాస్, నరేష్ ను ప్రత్యేకంగా అభినందించారు.








