భూపాలపల్లి, మహా : విద్యార్థులు ఎలా ఉన్నారు బాగా చదువుకుంటున్నారా టీచర్లు పాటలు ఎలా చెప్తున్నారు? ఏం సమస్యలు ఉన్నాయంటూ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ విద్యార్థులతో స్నేహ పూర్వక భేటీ చేశారు.
గురువారం భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని (కేజీబీవీ) జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. 10 వ తరగతి విద్యార్థుల సామర్ధ్యాలను కలెక్టర్ పరిక్షించేందుకు విద్యార్థులతో హిందీ పాఠంచదివించారు. చదవడంలో విద్యార్థులు చూపించిన ప్రతిభ పట్ల కలెక్టర్ అభినందించారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడి,అభిప్రాయాలను, సౌకర్యాలు, సమస్యల గురించి కలెక్టర్ రాహుల్ శర్మ అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కలెక్టర్ తో సంతోషంగా గడపడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువులో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలోను రాణించి నెంబర్ వన్ స్థాయికి చేరాలని విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉండాలని, తల్లిదండ్రులు నుండి దూరం వచ్చి చదువుకుంటున్నారని, విద్యార్థులను మన పిల్లలుగా భావించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ, విద్యా ప్రగతికి బాటలు వేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. స్టోర్ రూము, వంటగదిని పరిశీలించి వంట గది నిర్వహణను స్వయంగా ఫోటో తీసుకున్నారు. పాఠశాల నిర్వహణను పరిశీలించిన కలెక్టర్ భోజనం నాణ్యత, పరిశుభ్రత, నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్
భోజనం బావుంది… స్టోర్ రూమ్ నిర్వహణ బావుంది.. ఇలానే మంచిగా నిర్వహించండని సిబ్బందిని అభినందించారు. విద్యార్థులకు వసతి, భోజనంతో విద్యాబ్యాసానికి మంచి వాతావరణం కల్పించడంలో ఉపాధ్యాయుల కృషిని ప్రశంసించారు.పాఠశాలల్లో మురుగునీరు వెళ్లేందుకు అవుట్ లెట్, కాంపౌండ్ వాల్, సోలార్ విద్యుత్తు సౌకర్యం కల్పించాలని ప్రిన్సిపాల్ కోరగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, ఎంపీడీవో జయశ్రీ, ప్రిన్సిపల్ సుమలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.








